సుశాంత్ కేసులో కీలక మలుపు : రియాకు షాక్

5 Aug, 2020 13:09 IST|Sakshi

సీబీఐ దర్యాప్తునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  అనుమానాస్పద మృతి కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బిహార్ ప్రభుత్వం  చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి  దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.  (సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో )

ఈ సంఘటన మొత్తం ముంబైలో జరిగిందని, సుశాంత్ మరణించిన వెంటనే, ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి 56 మందిని ప్రశ్నించారని రియా న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. కాబట్టి దర్యాప్తు బాధ్యత ముంబై పోలీసులదేనని సుప్రీంకు తెలిపారు. అయితే ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ చాలా సాక్ష్యాలు మాయమయ్యాయని సుశాంత్ తండ్రి న్యాయవాది వికాస్ సింగ్ అన్నారు. దర్యాప్తులో ముంబై పోలీసులు బిహార్ పోలీసులకు సహకరించడం లేదని వాదించారు. (వాళ్లతో స్నేహం చేయడం నేరమా: ఆదిత్య ఠాక్రే)

ఈ వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు ఇది హై ఫ్రొఫైల్ కేసు...ప్రతిభావంతుడైన కళాకారుడు (సుశాంత్) అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. ఈ కేసులో నిజానిజాలు బయటికి రావాలని వ్యాఖ్యానించింది. అంతేకాదు బిహార్ పోలీసు అధికారిని క్వారంటైన్ చేయడం మంచి సంకేతం కాదని పేర్కొంది. దీనిపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ మూడు రోజుల్లో సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించింది.  సుశాంత్ తండ్రి తరఫున బిహార్ ప్రభుత్వ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్‌గి, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్ హాజరయ్యారు. (సుశాంత్ కేసు : మరో వివాదం)

కాగా సుశాంత్ ఆత్మహత్యకు మాజీ ప్రియురాలు రియా కారణమంటూ సుశాంత్ తండ్రి కృష్ణకిషోర్ సింగ్ ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు పట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో రియాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీనిపై సీబీఐ దర్యాప్తు కావాలని కూడా ఆయన కోరారు. అటు సుశాంత్ తండ్రి అభ్యర్థన మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ కేంద్రానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ సిఫారసు చేశారు. దీనికి తోడు  సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది అజయ్ అగర్వాల్, ముంబైకి చెందిన న్యాయశాస్త్ర విద్యార్ధి ద్వివేంద్ర దేవ్‌తాదీన్ దూబే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు  చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు