మాకు ఇది స్పెషల్‌ సంక్రాంతి!

14 Jan, 2023 04:15 IST|Sakshi

– సుష్మిత

‘‘బాబీగారు ‘వాల్తేరు వీరయ్య’ కథ చెప్పినప్పుడే వీరయ్య (చిరంజీవి పాత్ర పేరు) క్యారెక్టర్‌కి ఇలాంటి కాస్ట్యూమ్స్‌ అయితే బాగుంటుందనుకున్నాను. నా ఆలోచన, బాబీగారి ఐడియాలు చాలావరకూ మ్యాచ్‌ అయ్యాయి. నాన్నగారూ సలహాలు చెప్పారు’’ అన్నారు సుష్మిత కొణిదెల. చిరంజీవి, శ్రుతీహాసన్‌ జంటగా బాబీ కొల్లి (కెఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందిన చిత్రం  ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ కీలక పాత్ర చేశారు. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఇందులో చిరంజీవికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా చేసిన ఆయన కుమార్తె సుష్మిత చెప్పిన విశేషాలు.

► బాబీగారు ‘వాల్తేరు వీరయ్య’ కథ చెప్పినప్పుడు వింటేజ్‌ చిరంజీవిగారిని  చూపించాలన్నారు. అంటే.. అప్పటి ‘గ్యాంగ్‌ లీడర్‌’ టైమ్‌ అన్నమాట. ఈ సినిమాలో ఆయనది ఫిషర్‌ మ్యాన్‌ క్యారెక్టర్‌. సో.. కథ విన్నప్పుడే కాస్ట్యూమ్స్‌ని ఊహించేశా. నాన్నగారి సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి వింటేజ్‌ లుక్‌లో చూపించడానికి పెద్దగా కష్టపడలేదు. కానీ యూత్‌కి కూడా నచ్చాలి కాబట్టి ఇప్పటి ట్రెండ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని డిజైన్‌ చేశాను.

► ‘రంగస్థలం’లో నా తమ్ముడు రామ్‌చరణ్‌కి నేనే డిజైన్‌ చేశాను. ఇప్పుడు నాన్నగారివి కూడా అలాంటి డ్రెస్సులే. కానీ చరణ్‌కంటే నాన్నగారే ఈ మాస్‌ కాస్ట్యూమ్స్‌లో సూపర్‌. అయితే చరణ్‌ని కూడా మెచ్చుకోవాలి.  ఎందుకంటే తను సిటీలో పెరిగాడు. అయినప్పటికీ ‘రంగస్థలం’లో ఆ కాస్ట్యూమ్స్‌లో బాగా ఒదిగిపోయాడు. నాన్నగారి అభిమానులుగా మేం మిగతా అభిమానులతో పాటు ఈలలు వేస్తూ, గోల చేస్తూ శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు థియేటర్లో ‘వాల్తేరు వీరయ్య’ టీమ్‌తో కలిసి సినిమా చూశాం.

► ప్రస్తుతం నాన్న ‘బోళా శంకర్‌’కి డిజైన్‌ చేస్తున్నాను. ఇంకా రెండు వెబ్‌ సిరీస్‌లపై వర్క్‌ చేస్తున్నాం. మేం నిర్మించిన ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. మా గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నాన్నగారితో సినిమా నిర్మించాలని ఉంది. అందరి నిర్మాతలకు చెప్పినట్లే ఆయన ‘మంచి కథతో రా’ అన్నారు. మేం కూడా ఆ వేటలోనే ఉన్నాం.

► ఈ సంక్రాంతి స్పెషల్‌ అంటే.. మా తమ్ముడు తండ్రి కానుండటం. ఈ సమయం కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాం. సో.. మాకిది స్పెషల్‌ సంక్రాంతి. ఉపాసనది డాక్టర్స్‌ ఫ్యామిలీ కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏం ఆహారం తీసుకోవాలి? అనేది తనకు బాగా తెలుసు. మావైపు నుంచి మేం ఆమెను వీలైనంత హ్యాపీగా ఉంచుతున్నాం. పాప అయినా, బాబు అయినా మాకు ఓకే. కానీ నాకు, శ్రీజకు ఆడపిల్లలే. ఇంట్లో గర్ల్‌ పవర్‌ ఎక్కువైంది (నవ్వుతూ). అందుకే బాబు అయితే బాగుంటుందనుకుంటున్నాను.

మరిన్ని వార్తలు