ఎనిమిదేళ్ల విరామం తరువాత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రీ ఎంట్రీ

26 Nov, 2022 07:12 IST|Sakshi

‘సాక్షి’తో సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి  

‘ఆర్గానిక్‌ మామ – హైబ్రీడ్‌ అల్లుడు’తో 

రీ ఎంట్రీ ఇస్తున్న కుటుంబ కథా చిత్రాల డైరెక్టర్‌ 

సాక్షి, తూర్పుగోదావరి(రాజానగరం): ‘కథ పాతదే అయినా చెప్పే విధానం కొత్తగా ఉంటే ప్రేక్షక్షులు ఎప్పుడూ ఆదరిస్తారు. ప్రస్తుతం కాసుల వర్షం కురిపిస్తున్న ‘కాంతార’, ఇటీవల విడుదలై సూపర్‌ హిట్‌ అయిన ‘కార్తికేయ –2’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. పరమ మూఢభక్తితో కూడిన కథాంశంతో తీసిన చిత్రాలను కూడా ఈ రోజు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంటే వారు ఎప్పుడూ ఒకే మూసలో ఉండే చిత్రాలను కాకుండా కొత్తదనం ఉన్న చిత్రాలనే ఆదరిస్తారని అర్థమవుతోంది’ అంటున్నారు ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.

తూర్పు గోదావరి జిల్లాలోని కొంకుదురుకు చెందిన ఈయన రాజానగరంలో శుక్రవారంఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. 2014లో యమలీల–2 సినిమా తీసి, విరామం తీసుకున్న ఆయన తాజాగా మెగాఫోన్‌ పట్టారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడిగా ఎనిమిదేళ్ల విరామం తరువాత ఇస్తున్న రీ ఎంట్రీ గురించి వివరించారు.  

ప్రశ్న: రాజేంద్రుడు–గజేంద్రుడు, మాయలోడు, వినోదం, మావిచిగురు, యమలీల, శుభలగ్నం వంటి అనేక సూపర్‌ హిట్లు ఇచ్చిన మీరు చాలా కాలంగా సినిమాలు తీయడం లేదు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు? 

జవాబు: ‘ఆర్గానిక్‌ మామ – హైబ్రీడ్‌ అల్లుడు’ అనే చిత్రాన్ని తీస్తున్నాను. దాదాపుగా షూటింగ్‌ పార్టు అంతా పూర్తయింది. జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రంలో సహాయ్‌లరగర్, మృణాళిని హీరో హీరోయిన్లు కాగా ఆర్గానిక్‌ మామగా రాజేంద్రప్రసాద్‌ నటిస్తున్నారు. అలాగే మీనా, సునీల్, అజయ్‌ఘోష్‌, సూర్య, హేమ ఇలా అనేకమంది తారాగణం ఉన్నారు. గతంలో నేను తీసిన చిత్రాలలో కనిపించే కుటుంబ నేపథ్య వాతావరణంతోపాటు హాస్యరసం, కష్టాలు, కన్నీళ్లు, చక్కటి సంగీతంతో కూడిన వినోదం.. అన్నీ ఉంటాయి.   

ప్రశ్న: ఎనిమిదేళ్ల అనంతరం ఈ సినిమా తీయడానికి కారణం? 

జవాబు: కాలంతోపాటు ప్రేక్షకుల ఆదరణలో వస్తున్న మార్పులను గమనిస్తున్న నేను  ఖాళీగా కుర్చోవడం ఎందుకని ఒక కథ తయారు చేశా. దానికి స్క్రీన్‌ప్లే, మాటలు కూడా రాసిన తరువాత రూ. 10 కోట్ల వ్యయంతో ఈ సినిమాను తీశాను. క్‌లైమాక్స్‌లో కూడా నవ్వులు కురిపించే చిత్రంగా వచ్చింది. గతంలో మాయలోడు, వినోదం సినిమాలు వచ్చాయి. వాటిని మరింపిచే రీతిలో ఈ సినిమా ఉంటుంది. దీనిలో వ్యక్తుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు, పగలు, ప్రతీకారాలు, అన్నీ మిళితమై ఉంటాయి. ప్రతి అంశంలోను కామెడీ ఉంటుంది. 

ప్రశ్న: మీ సినిమాలో సందేశం ఏమైనా ఉంటుందా? 

జవాబు: ‘ప్రేమను ప్రేమతోనే కలుపుకోవాలి గాని, పగలు, ప్రతీకారాలతో కాదనే’ సందేశంతో ఈ సినిమాను రూపొందించాం. ప్రేమించడం చేతనైన వాడికి కష్టం తెలియదు, పగతో రగిలిపోయేవాడికి సుఖం దొరకదు, ఇది జగమెరిగిన సత్యం.  

ప్రశ్న: తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో మీ స్పందన ఏమిటి? 

జవాబు: తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడిక్కెడికో పరుగులు పెడుతోంది. ఆనందమే, కానీ బడ్జెట్‌ విషయంలో కాస్త కంట్రోలు ఉంటే బాగుంటుంది. కథ డిమాండ్‌ని బట్టి వ్యయం ఉండాలిగాని, గొప్పగా చెప్పుకునేందుకు  కాలాన్ని, డబ్బును వృథా చేయకూడదు. వృథా చేస్తే డబ్బు సంపాదించుకోవచ్చునేమోగాని, కాలాన్ని వెనక్కి తీసుకురాలేం.  

ప్రశ్న: దర్శకుడిగా కెరీర్‌ కొనసాగిస్తారా?  
జవాబు: కొంతకాలం పాటు సినిమాలు తీయడం కొనసాగిస్తాను. ప్రేక్షకుల ఆదరణ కూడా ఉంటే....  

మరిన్ని వార్తలు