సీనియర్‌ దర్శకుడు ఎస్‌వీ.రమణన్‌ కన్నుమూత 

27 Sep, 2022 06:43 IST|Sakshi

సీనియర్‌ దర్శకుడు, రేడియో డబ్బింగ్‌ కళాకారుడు ఎస్‌వీ.రమణన్‌ (87) సోమవారం వేకువజామున కన్నుమూశారు. ఈయన యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ తాత కావడం గమనార్హం. 1930–40 ప్రాంతంలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.సుబ్రమణియన్‌ కుమారుడే ఈయన. సినీ పరిశ్రమలో పలు శాఖల్లో పేరు తెచ్చుకున్న ఎస్‌వీ రమణన్‌ రేడియో రంగంలో పలు ప్రయోగాలు చేశారు. వేలాది రేడియో ప్రసారాలకు డబ్బింగ్‌ చెప్పారు. పలు భక్తిరస లఘు చిత్రాలను రూపొందించారు.

ముఖ్యంగా రమణ మహర్షి, సాయిబాబా  గురించి డాక్యుమెంటరీలను రూపొందించి ప్రాచుర్యం పొందారు. యారుక్కాగ అళుదాన్‌ చిత్రంతో సంగీత దర్శకుడిగా కూడా పరిచయం అయ్యారు. అదే విధంగా నటుడు వైజీ మహేంద్రన్, సుహాసిని కలిసి నటించిన ఉరువంగళ్‌ మారలామ్‌ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో శివాజీగణేశన్, కమలహాసన్, రజినీకాంత్‌ అతిథి పాత్రల్లో నటించడం విశేషం. స్థానిక ఏఆర్‌ పురంలో నివశిస్తున్న  ఎస్‌వీ రమణన్‌కు భార్య భామ, కూతుళ్లు లక్ష్మి, సరçస్వతి ఉన్నారు. కాగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యం కారణంగా సోమవారం వేకువజామున రమణన్‌ తుదిశ్వాస విడిశారు. సాయంత్రం అత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు.   

మరిన్ని వార్తలు