వెబ్‌ దునియాను ఏలేస్తున్న బెంగాలీ బ్యూటీ

4 Apr, 2021 08:52 IST|Sakshi

కేవలం స్క్రీన్‌ మీద కనిపిస్తే చాలు అనుకోలేదు. తన కంటే తన పాత్రలకే అభిమానులు ఉండాలని అనుకుంది, సాధించింది. విభిన్న పాత్రలతో వెబ్‌ సిరీస్‌ దునియాను ఏలేస్తున్న బెంగాలీ బ్యూటీ స్వస్తిక గురించి కొన్ని మాటల్లో.. 

►  కోల్‌కతాలో పుట్టి పెరిగింది. పద్దెనిమిదేళ్ల వయసులోనే ప్రముఖ బెంగాలీ సింగర్‌ సాగర్‌ సేన్‌ కుమారుడు ప్రమిత్‌ సేన్‌తో వివాహం అయింది. రెండేళ్లకే ఆ బంధం నుంచి విడిపోయి, ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు ఒక పాప. పేరు అన్వేష. 

►  రెండు దశాబ్దాల కిందటే ‘హేమంతర్‌ పాఖీ’ అనే బెంగాలీ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది స్వస్తిక. అంతకు ముందు ‘దేవదాసి’ బెంగాలీ టీవీ సీరియల్‌లో నటించింది. ఆ తర్వాత ‘మస్తాన్‌’, ‘ముంబయ్‌ కటింగ్స్‌’ సినిమాలు చేసింది. 

►  నిదానమే ప్రధానం ఆమె లక్షణం. వరుస అవకాశాలకు ఆశ పడకుండా.. కేవలం ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తూ వస్తోంది. ‘డిటెక్టివ్‌ బ్యోమకేశ్‌ బక్షి’, ‘దిల్‌ బేచారా’ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి. 

►  ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా తను నటించిన అన్ని సినిమాలూ, వెబ్‌ సిరీస్‌లూ.. వరుసగా వివిధ ఓటీటీ వేదికల్లో విడుదలయ్యాయి. దీంతో, ఒకే సంవత్సరంలో ఎనిమిది విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. 

►  రూమర్స్‌.. పాత్రల ఎంపికలో ఉన్న పట్టు, జీవిత భాగస్వామి ఎంపికలో లేకపోయింది. అప్పట్లో సహనటుడు సుమన్‌ ముఖోపాధ్యాయతో మోసపోయి, ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు ఆమెపై పెద్దగానే పుకార్లు వినిపించాయి. ఆ తర్వాత కూడా కొంతమందితో ప్రేమలో ఉండి, విడిపోయింది. 

►  ఒకసారి చేసిన పాత్ర తిరిగి చేయకూడదనేదే నా లక్ష్యం. నన్ను నేను ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తగా  కనిపించడానికే ఆసక్తి చూపిస్తా. ఎక్కువ సినిమాలు చేయాలి. ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచనే నాకు లేదు. – స్వస్తికా ముఖర్జీ

చదవండి: నేనెప్పుడూ డ్ర‌గ్స్ తీసుకోలేదు: స్వ‌స్తిక
చదవండి: న‌టి సెల్ఫీ: అస్స‌లు బాగోలేదంటున్న నెటిజ‌న్లు

మరిన్ని వార్తలు