Bootcut Balaraju Movie Review: బూట్‌కట్‌ బాలరాజు రివ్యూ.. సోహైల్‌ సినిమా ఎలా ఉందంటే?

3 Feb, 2024 13:04 IST|Sakshi
Rating:  

బిగ్‌బాస్‌తో వచ్చిన ఫేమ్‌ను కాపాడుకుంటూ హీరోగా నిలదొక్కుకుంటున్నాడు సోహైల్‌. గతంలో మిస్టర్‌ ప్రెగ్నెంట్‌తో మెప్పించిన ఇతడు తాజాగా(ఫిబ్రవరి 2న) బూట్‌కట్‌ బాలరాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సోహైల్‌ నిర్మాతగానూ వ్యవహరించాడు. మేఘలేఖ హీరోయిన్‌గా నటించగా సునీల్‌, ఇంద్రజ, అవినాష్‌ కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస్‌ కోనేటి దర్శకత్వం వహించారు.

కథ ఏంటంటే..
తండ్రి (సుమన్‌)కు ఇచ్చిన మాట కోసం పటేలమ్మ(ఇంద్రజ) తన భర్తను కూడా వదిలేసి ఊరిపెద్దగా మారుతుంది. ఆమె కూతురు మహాలక్ష్మి(మేఘలేఖ)ని అందరూ గౌరవించేవారు. అదే సమయంలో భయంతో ఎవరూ దగ్గరకు వచ్చేవారు కాదు. స్కూల్‌లో కూడా ఎవరూ తనతో స్నేహం చేయరు. అలాంటి సమయంలో బాలరాజు (సోహైల్‌) మహాలక్ష్మిని అందరితో సమానంగా చూస్తాడు. అలా వీరిమధ్య స్నేహం మొదలవుతుంది. కట్‌ చేస్తే.. కాలేజీ లైఫ్‌లో బాలరాజును అదే కళాశాలలో చదువుకునే సిరి(సిరి హన్మంతు) ప్రేమిస్తుంది. అయితే మహాలక్ష్మి కూడా తనకు తెలియకుండానే బాలరాజుతో ప్రేమలో పడుతుంది.

సిరి కన్నా ముందే మహాలక్ష్మి తన మనసులోని మాట చెప్పేస్తుంది. అలా ఇద్దరి ప్రేమ మొదలవుతుంది. ఈ విషయం తెలిసి పటేలమ్మ.. బాలరాజును ఊరువదిలి వెళ్లిపోవాలంటుంది. ఆ సమయంలో ఇద్దరికీ మాటామాటా పెరుగుతుంది. నా మీద గెలిచి సర్పంచ్‌ అయితే నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేస్తా అంటుంది పటేలమ్మ. ఊరిలో మంచి పేరు లేని బాలరాజు సర్పంచ్‌ అయ్యాడా? తన ప్రేమ గెలిచిందా? లేదా? అన్న వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే?
గొప్పింటి అమ్మాయిని పేదింటి కుర్రాడు ప్రేమించడం, ఏదో ఒక ఛాలెంజ్‌ వేసి తన ప్రేమ గెలిపించుకోవడం చాలా సినిమాల్లో చూశాం. ఈ మూవీ కూడా దాదాపు అదే కోవలోకి వస్తుంది. కథ అంత కొత్తగా అనిపించదు కానీ దాన్ని డీల్‌ చేసిన విధానం పర్వాలేదనిపించింది. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, హీరోహీరోయిన్ల మధ్య స్నేహం ప్రేమగా మారిన వైనాన్ని చూపించారు. సెకండాఫ్‌లో బాలరాజు సర్పంచ్‌ అవడానికి ఏం చేశాడనేది చూపించారు. కామెడీ బాగానే వర్కవుట్‌ అయింది.

సోహైల్‌ హైపర్‌ యాక్టివ్‌గా ఉండే కుర్రాడిగా మెప్పించాడు. చివర్లో ఎమోషన్స్‌ కూడా పిండేశాడు. పటేలమ్మగా ఇంద్రజ నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. హీరోయిన్‌ మేఘలేఖ పల్లెటూరమ్మాయిగా ఒదిగిపోయింది. అవినాష్‌, సద్దాం కామెడీ బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడనట్లు కనిపిస్తుంది. పల్లెటూరి విజువల్స్‌ అంత చక్కగా ఉన్నాయి. పాటలు కొన్ని బోర్‌ కొట్టిస్తాయి. దర్శకుడు కథను ఇంకాస్త బెటర్‌గా ప్రజెంట్‌ చేసుంటే బాగుండేది. ఓవరాల్‌గా సినిమా పర్వాలేదు.

Rating:  
(2.5/5)

whatsapp channel

మరిన్ని వార్తలు