టాలీవుడ్‌ ‘మిషన్ ఇంపాజిబుల్ ’లో తాప్సీ

6 Jul, 2021 10:43 IST|Sakshi

టాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన తాప్సీ కొన్నాళ్లక్రితం బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ ఈ సొట్టబుగ్గల సుందరికి మంచి కాన్సెప్ట్‌ ఉన్న కథలు దొరకడంతో బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో హిట్లు కూడా అందుకుంది. ప్రస్తుతం ఏడాదికి ఆరేడు సినిమాలు చేస్తూ ఏ హీరోయిన్ లేనంత బిజీగా గడుపుతోంది తాప్సీ. దీంతో ఈ భామ టాలీవుడ్‌కి దూరమైపోయింది. మహి డైరక్షన్ లో ఆనందోబ్రహ్మ సినిమా తర్వాత తాప్సీ తెలుగు సినిమాల్లో నటించలేదు. 

లేటెస్ట్‌గా ఓ తెలుగు సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది ఈ సొట్టబుగ్గల సుందరి. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించే మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో నటిస్తోంది తాప్సీ. గతంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాను అందించిన స్వరూప్ అందిస్తున్న సినిమా ఇది. నిరంజన్ రెడ్డి నిర్మించే ఈ సినిమాను ఓ వైవిధ్యమైన సబ్జెక్ట్ తో రూపొందిస్తున్నారు.

మంగళవారం నుంచి మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు తాప్సీ. ఆమెకు గ్రాండ్ వెల్క‌మ్ చెప్పింది చిత్ర యూనిట్‌. అలాగే చేతికి క‌ట్టుతో ల్యాప్‌టాప్‌లో ఏదో సీరియ‌స్‌గా చూస్తున్న వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. 

ఈ సంద‌ర్భంగా  తాప్సీ ప‌న్ను మాట్లాడుతూ - ‘గత 7 సంవత్సరాలుగా ఒక‌ ప్రేక్షకుడిగా నన్ను నేను చూడాలనుకునే కథలలో భాగం కావాలని వెతుకుతున్నాను. దాని కోసం నేను నా సమయాన్ని, డబ్బును ఖర్చు చేశాను. మిషన్ ఇంపాజిబుల్ అలాంటి చిత్రాల్లో ఒక‌టి. ఆకట్టుకునే కథాంశం మ‌రియు మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ లాంటి మంచి టీమ్ కావ‌డంతో ఈ చిత్రాన్ని ఎంచుకున్నాను. క్వాలిటీ  చిత్రాలను ఎన్నుకోవడంలో ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకాన్ని ఇలాంటి సినిమాల‌లో భాగం కావడం ద్వారా నేను ఖచ్చితంగా నిల‌బెట్టుకోగ‌ల‌ను అని న‌మ్ముతున్నాను’ అన్నారు. 

మరిన్ని వార్తలు