Tabu: సినిమాల్లోకి రాకముందు టబుకు లైంగిక వేధింపులు.. ఆ హీరో నిజంగా అలా చేశాడా?

4 Nov, 2022 15:33 IST|Sakshi

భారత్‌లో అత్యున్నత నాలుగో అవార్డు పద్మ శ్రీ సాధించిన ఘనత. జాతీయ ఉత్తమ నటిగా రెండు అవార్డులు, ఆరు ఫిలింఫేర్‌ అవార్డులు. చలనచిత్ర రంగానికి చేసిన సేవలకు మరెన్నో పురస్కారాలు, విమర్శకుల ప్రశంసలు. 52 ఏళ్ల వయసులోనూ వెబ్‌ సిరీస్‌లు, సినిమాల్లో లీడ్‌ రోల్స్‌ చేస్తూ బిజీబిజీ. నేడు దిగ్గజ నటి టబు పుట్టినరోజు. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు..!

1985లో ఎవర్‌గ్రీన్‌ నటుడు దేవానంద్‌  నవ్‌ జవాన్‌ సినిమాలో టీనేజర్‌ కేరెక్టర్‌ ద్వారా టబు సినీరంగ ప్రవేశం చేసింది. 1991లో విక్టరీ వెంకటేష్‌ హీరోగా కూలీ నెం.1 సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. హిందీ, తమిళ్‌, తెలుగు భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. పలు హాలీవుడ్‌ సినిమాల్లో నటించి మెప్పించింది.

ఎన్నో ఛాలెంజింగ్‌ పాత్రలు చేసిన టబు తనకంటూ ప్రత్యేక గుర్తింపుపొందింది. 1994లో బాలీవుడ్‌ మూవీ విజయ్‌పథ్‌లో నటించి ఫిలింఫేర్‌ అవార్డు గెలుపొందింది. గుల్జార్‌, మాచీస్‌ సినిమాల్లో నటనకు విమర్శకుల ప్రశంసలు, ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డులు వరించాయి. నాగార్జున కెరీర్‌ని మరో మలుపు తిప్పిన నిన్నే పెళ్లాడతా సినిమాలో టబు నటన యువతకు గిలిగింతలు పెట్టింది. ఆ సినిమాకు కూడా ఆమెకు ఫిలింఫేర్‌ అవార్డు లభించింది. 

విరాసత్‌, అస్థిత్వ, చాందినీ బార్‌ సినిమాల్లో నటనకు విమర్శకుల ప్రశంసలు పొందింది. తదనంతరం కాలంలో సపోర్టింగ్‌ కేరెక్టర్లతోనూ రాణిస్తోంది. అంధాధూన్‌, భూల్‌భులయ్యా-2, దృశ్యం-2 వంటి సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తూ టబు  బిజీ అయింది. అయితే, తన వ్యక్తిగత విషయాలను ఎక్కువగా షేర్‌ చేసుకోని ఆమె జీవితంలో ఓ చేదు ఘటన దాగుంది.
(చదవండి: అరుదైన వ్యాధులతో బాధపడుతున్న అందమైన భామలు వీళ్లే)

టాప్‌ హీరోయిన్‌ చెల్లి
టబు అసలు పేరు తబస్సుమ్‌ ఫాతిమా హష్మి. ఆమె సోదరి ఫరా నాజ్‌ అప్పట్లో టాప్‌ హీరోయిన్‌. సోదరి వెంట టీనేజర్‌గా ఉన్న టబు షూటింగ్‌ స్పాట్లకు వెళ్లేది. అలా వెళ్లిన సమయంలోనే 1980లో లైంగిక వేధింపులకు గురైంది. ఒరిస్సా పోస్టు 1986లో ఇచ్చిన  కథనం ప్రకారం.. జాకీ ష్రాఫ్‌, ఫరా నాజ్‌ హీరో, హీరోయిన్లుగా ఓ సినిమా షూటింగ్‌ మారిషస్‌లో జరుగుతోంది.

ఆ క్రమంలో సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు డేనీ డెంగ్జోపా అక్కడే తన ఇంట్లో చిత్ర యూనిట్‌కు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడు. పార్టీలో ఫరా నాజ్‌తోపాటు టబు కూడా పాల్గొంది. అయితే, ఫరా నాజ్‌ ఫూటుగా తాగి పడిపోయింది. సోదరి పరిస్థితి చూసి అప్పటికే భయంతో వణిపోయిన టబుకు మరో ఉపద్రవం వచ్చిపడింది. మద్యం మత్తులో ఉన్న జాకీ ష్రాఫ్‌ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది గమనించిన డేనీ డెంగ్జోపా ఆ స్థితిలో నుంచి టబును రక్షించాడు.

తర్వాత ఈ విషయం కొద్దికాలం ఎక్కడా బయటకు పొక్కలేదు. కానీ, ఫరా నాజ్‌ తన సోదరి పట్ల జాకీ ష్రాఫ్‌ ప్రవర్తనను ఎండగట్టింది. లైంగికంగా తన చెల్లెలిని వేధించాడని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ అంశం అప్పట్లో సంచలనంగా మారింది. ఇంత జరిగినా టబు ఎక్కడా ఎప్పుడూ ఈ విషయాన్ని చెప్పకపోవడం గమనార్హం. ఎందరో నటులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ఆమె జాకీ ష్రాఫ్‌తో మాత్రం లీడ్‌ రోల్స్‌లో ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ చేయలేదు. గతంలో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరగడం మామూలైపోయింది.
(చదవండి: చీటింగ్‌ చేసి ప్రియాంక మిస్‌ వరల్డ్‌ అయ్యిందా? ఆమె కామెంట్స్‌ వైరల్‌)

మరిన్ని వార్తలు