అదిరిపోయే ఆరు సెట్లు!

23 Apr, 2021 01:23 IST|Sakshi

ముంబయ్‌లోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా, తాజ్‌ ప్యాలెస్‌ని ‘మేజర్‌’ సినిమా కోసం హైదరాబాద్‌ తీసుకొచ్చారు ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్లా. అడివి శేష్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ఇది. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు ఏఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏప్లస్‌ఎస్‌ మూవీస్‌ సహకారంతో సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మించింది. 26/11 ముంబయ్‌ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడిలో తన ప్రాణాలను పణంగా పెట్టి, ప్రజలను కాపాడిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్యాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘మేజర్‌’ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రం కోసం ఆరు భారీ సెట్స్‌ నిర్మించిన ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ మాట్లాడుతూ– ‘‘ముంబయ్‌లోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా సెట్, ఎన్‌ఎస్‌జీ కమాండోలకు సంబంధించిన ‘సెట్‌ని కూడా తీర్చిదిద్దాం. ముఖ్యంగా తాజ్‌ ప్యాలెస్‌ సెట్‌ వేయడానికి బాగా కష్టపడ్డాం. సినిమాలో తాజ్‌ హోటల్‌ని సెట్‌ ప్రాపర్టీలాగా కాకుండా ఓ క్యారెక్టర్‌లా ఊహించుకోవాలని అడివి శేష్‌ చెప్పడంతో రియల్‌ తాజ్‌ ప్యాలెస్‌లా సెట్‌ వేశాం. తాజ్‌లో గ్రాండ్‌ స్టెయిర్‌ కేస్, టాటా ఐకానిక్‌ ఇమేజ్, ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ పెయింటింగ్స్‌ వంటి వాటిని రీ–క్రియేట్‌ చేశాం. 120 అడుగుల ఎత్తుతో ఐదు ఫ్లోర్స్‌ హోటల్‌ సెట్‌ను ఫైబర్, ఉడ్, ఐరన్‌ ఉపయోగించి తయారు చేశాం’’ అన్నారు.

చదవండి: గుండె పగిలింది: విషాదంలో పూజా హెగ్డే 

మరిన్ని వార్తలు