కోలీవుడ్‌కి రీఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ.. విజయం దక్కేనా?

3 Sep, 2022 11:06 IST|Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా సుదీర్ఘ విరామం తర్వాత కోలీవుడ్‌లోకి ఎంటర్‌ కాబోతుంది. అందం అభినయం మెండుగా ఉన్న నటి తమన్నా భాటియా. ఆదిలో అందాలతో వెండితెరను ఊపేసినా, ఆ తర్వాత బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో అద్భుత అభినయాన్ని చాటి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం క్రేజ్‌ కాస్త తగ్గిందనే చెప్పాలి. అయినా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగానే ఉంది.

అయితే ఈ 36 ఏళ్ల జాణకు కోలీవుడ్‌లో మాత్రం ఆశించిన విజయాలు దక్కలేదని చెప్పాలి. దీంతో ఇక్కడ ఆగ్రనటిగా రాణించాలన్న ఆమె కోరిక ఇప్పటికీ కలగానే మిగిలిపోయిందనే చెప్పవచ్చు. అలాంటిది అనూహ్యంగా ఇప్పుడు అగ్ర నటుడితో  నటించే అవకాశం రావడం నిజంగా ఈ అమ్మడికి లక్కీ అనే చెప్పాలి. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తో ఒక్క చిత్రంలో ఒక్క సన్నివేశంలో నటించే అవకాశం వస్తే చాలని భావించే నటీమణులు ఎందరో ఉంటారు. అలాంటి అవకాశం నటి తమన్నాకు  జైలర్‌ చిత్రంతో వరించింది.

దీంతో ఈ చిత్రంలో పాల్గొనడానికి ఈ బ్యూటీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీస్ట్‌ చిత్రం ఫేమ్‌ నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఆయనకు జంటగా నటి ఐశ్వర్య రాయ్, తమన్నా నటింనున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరిలో నటి తమన్నా పాత్ర పరిధి తక్కువే అనే టాక్‌ వినిపిస్తోంది. అయినా జైలర్‌ చిత్రంలో నటించడానికి చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నట్లు తమన్నా ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొంది. మరి ఆమెకు జైలర్‌ చిత్ర యూనిట్‌ నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందో చూడాలి!  

మరిన్ని వార్తలు