నటుడు కార్తీక్‌కు అస్వస్థత‌ ఆస్పత్రిలో చేరిక

22 Mar, 2021 07:59 IST|Sakshi

సాక్షి, చెన్నై: మనిద ఉరిమై కట్చి (మానవ హక్కుల పార్టీ) వ్యవస్థాపకుడు, సీనియర్‌ నటుడు కార్తీక్‌ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా నటుడు కార్తీక్‌ సుపరిచితుడే. ఈయన వారసుడు సైతం ప్రస్తుతం సినిమాల్లోకి వచ్చారు. తాజాగా అప్పుడప్పుడు తెరపై కనిపించే కార్తీక్, ప్రస్తుతం రాజకీయ ప్రచారానికి సిద్ధమయ్యారు. మనిద ఉరిమై కట్చి వ్యవస్థాపకుడిగా ఉన్న కార్తీక్‌ తన మద్దతును అన్నాడీఎంకే–బీజేపీ కూటమికి ప్రకటించారు.

ఈ పరిస్థితుల్లో ప్రచారం ముగించుకుని శనివారం రాత్రి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస సమస్య తలెత్తడంతో కుటుంబీకులు చెన్నై అడయార్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు  చికిత్స అందిస్తున్నారు. కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్‌ అని తేలింది. అయితే, ఆయనకు శ్వాససంబంధిత సమస్యలు ఉండడంతో పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. 

సుధీష్‌కు పాజిటివ్‌..
డీఎండీకే నేత విజయకాంత్‌ బావ మరిది, ఆ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సుధీష్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. శనివారం రాత్రి ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షలో కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయనతో సంప్రదింపుల్లో ఉన్న వారందరూ పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

చదవండి: హీటెక్కిస్తున్న‘సీటీమార్‌’ పెప్సీ ఆంటీ సాంగ్
ఆలియా.. అచ్చం సాగర కన్య!

మరిన్ని వార్తలు