ప్రశాంత్‌ కిషోర్‌తో తమిళ స్టార్‌ హీరో భేటీ.. పోలిటికల్‌ ఎంట్రీకీ సంకేతమా?

17 Mar, 2022 07:13 IST|Sakshi

దళపతి విజయ్‌ రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? సాధ్యాసాధ్యాలను బేరిజువేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారా ? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. రానున్న (2024) లోక్‌సభ ఎన్నికల్లోగా క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని, పార్టీని స్థాపించాలని ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ నిర్వాహకులు ఒత్తిడి చేస్తున్న తరుణంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో నటుడు విజయ్‌ భేటీ కావడం చర్చనీయాంశమైంది. 

 సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లోకి రావాలని నటుడు విజయ్‌కు ఎంతోకాలంగా ఉంది. ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ కూడా ఆసక్తి ఉంది. ఈ క్రమంలోనే ‘ ఆలిండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ పేరుతో ఒక పార్టీ పేరును రిజిస్టర్‌ చేయడం, కుమారుడి ఒత్తిడితో ఉప సంహరించడం కూడా జరిగిపోయింది. తన రాజకీయ ప్రవేశంపై తండ్రి ప్రదర్శిస్తు న్న దూకుడు సినీ జీవితాన్ని దెబ్బతీస్తుందనే కారణంగా ఆ ప్రయత్నాలకు విజయ్‌ అడ్డుకట్టవేశారు. అయితే, ఇటీవల ముగిసిన మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల విజయ్‌ మక్కల్‌ ఇయక్కంకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. వారందరినీ విజయ్‌ ఇంటికి పిలిపించుకుని ఫొటో దిగారు. ఈ తరుణంలోనే విజయ్‌ మదిలో క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆశలు తలెత్తాయి. (చదవండి: Allu Arjun - Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో బన్ని..! )

ప్రశాంత్‌ కిషోర్‌తో భేటీ
హైదరాబాద్‌లో కొన్ని రోజుల క్రితం విజయ్, ప్రశాంత్‌ కిషోర్‌ రహస్యంగా సమావేశమై రాజకీయ చర్చలు సాగించడం ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై విజయ్‌ సన్నిహితుడు మాట్లాడుతూ.. ‘తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడింది, ఆ పార్టీకి రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. బీజేపీతో పొత్తుపెట్టుకున్న అన్నాడీఎంకే నాయకత్వ లోపంతో సతమతం అవుతోంది. కరుణానిధిపై ధ్వేషం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ భవిష్యత్తు ఏంటోనని అన్నాడీఎంకే నేతలు కలతచెందుతున్నారు. అలాగని డీఎంకేలో చేరేందుకు వారు ఇష్టపడటం లేదు. బీజేపీతో పొత్తు వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని వారు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విజయ్‌ పార్టీ పెడితే అన్నాడీఎంకే శ్రేణులు కొత్త పార్టీలో చేరే అవకాశం ఉంది.

మరోవైపు రజనీకాంత్‌ పార్టీ ఏర్పాటు అటకెక్కడంతో రజనీ మక్కల్‌ మన్రం నిర్వాహకులు, అభిమానులు డీఎంకేలో చేరారు. మరికొందరు ఏ పార్టీ వైపు మొగ్గుచూపలేకపోతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే పార్టీ పెట్టి బరిలోకి దిగితే కనీసం 10 శాతం ఓట్లు సాధించి డీఎంకే, అన్నాడీఎంకే తరువాత మూడో అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ పార్టీ నాయకత్వంలో మెగా కూటమి ఏర్పాటు చేసుకుని అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు. అందుకే ప్రశాంత్‌ కిషోర్‌ను విజయ్‌ కలుసుకున్నారు. మక్కల్‌ ఇయక్కం కదలికలను ఇంటెలిజెన్స్‌ వర్గాలు తీవ్రంగా గమనిస్తున్నాయి.

విదేశీ కారు దిగుమతికి సంబంధించి కోర్టులో విజయ్‌ వేసిన పిటిషన్‌పై తమిళనాడు ప్రభుత్వం స్పందించడంతోపాటు జరిమానా విధించి కేసును కొట్టివేయాల్సిందిగా వాదించింది. విజయ్‌ ప్రతిష్టను దెబ్బతీసేలా డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌ అనుచరులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి విజయ్‌ వస్తున్నట్లు ఉదయనిధి అనుచరవర్గం, డీఎంకే ఆందోళన చెందుతోందని తాము భావిస్తున్నట్లు’ వివరించారు. కాగా పార్టీ ఏర్పాటుపై విజయ్‌ మక్కల్‌ ఇయక్కం ప్రధాన కార్యదర్శి పి.ఆనంద్‌ కార్యాచరణలోకి దిగినట్లు తెలుస్తోంది.

విజయ్‌ మరో రజనీకాంత్‌ 
అయితే తమిళ సినీపరిశ్రమలోని వారు మాత్రం మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ స్థాపనలో విజయ్‌ మరో రజనీకాంత్‌లా మారినా     ఆశ్చర్యం లేదని అంటున్నారు. వందశాతం విజయం సాధించగలమనే నమ్మకం ఉంటేనే రాజకీయాల్లోకి వెళ్లాలి, లేకుంటే ఈ ప్రచారాలను సినిమాకు వాడుకోవచ్చని నటుడు రజనీకాంత్‌ లాగే విజయ్‌ కూడా భావించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ప్రశాంత్‌ కిషోర్, విజయ్‌ల భేటీ అని సినీ వర్గాలు చమత్కరిస్తున్నాయి.

మరిన్ని వార్తలు