నాలుగేళ్లు నరకం చూశా.. నిత్యం కొట్టేవాడు.. విడాకుల ఫోటోషూట్‌ వెనుక నటి కన్నీటి గాధ

4 May, 2023 14:55 IST|Sakshi

పుట్టినరోజు, పెళ్లిరోజు, ప్రేమికుల రోజు.. కాదేదీ సెలబ్రేట్‌ చేసుకోవడానికి అనర్హం అన్నట్లుగా బోలెడన్ని స్పెషల్‌ డేలు ఉన్నాయి. స్పెషల్‌ డే రోజు స్పెషల్‌ షూట్‌ సరేసరి. ఈ మధ్య అయితే ప్రీవెడ్డింగ్‌ షూట్‌, మెటర్నటీ షూట్‌.. ఇలా అనేక రకాల ఫోటోషూట్‌లు కూడా చేస్తున్నారు. అయితే తమిళ బుల్లితెర నటి షాలిని మాత్రం వినూత్నంగా విడాకులను సెలబ్రేట్‌ చేసుకుంది. తన భర్త పీడ విరగడైందన్నట్లుగా అతడి ఫోటోలు చింపుతూ ఇన్నాళ్లకు విముక్తి లభించిందన్నట్లుగా ఫోటోలకు పోజులిచ్చింది. ఇది చూసి కొందరు విస్తుపోగా ఆమె బాధ అర్థం చేసుకున్నవాళ్లు మాత్రం మెచ్చుకుంటున్నారు.

తాజాగా ఈ నటి తను విడాకులు తీసుకునేంత కష్టం ఏమొచ్చిందో వెల్లడించింది. అంతేకాదు ఆ ఫోటోషూట్‌ పబ్లిసిటీ కోసం చేయలేదని, తనలాంటి మహిళలకు ఓ మెసేజ్‌గా ఉపయోగపడాలని భావించానంది. భర్త పెట్టిన టార్చర్‌ గురించి ఆమె మాట్లాడుతూ.. 'దుబాయ్‌లో నా భర్త నన్ను కొట్టినప్పుడు పార్కింగ్‌లో వచ్చి పడుకునేదాన్ని. ఎందుకంటే గొడవను పెద్దది చేయకుండా, దాన్ని ఆపేయడానికే ప్రయత్నించేదాన్ని. అంతకుమించి ఏం చేయాలో తెలియకపోయేది. ఒక్క క్షణం పోలీసుల దగ్గరకు వెళ్దామా.. అనిపించినా మళ్లీ అతడి జీవితం నాశనం అవుతుంది కదా అని నేను అడ్జెస్ట్‌ అయిపోయేదాన్ని.

అలా అతడు కొట్టినప్పుడల్లా కింద పార్కింగ్‌ ప్రదేశంలో పడుకునేదాన్ని. తెల్లారాక ఇంటికి వెళ్లేదాన్ని. 2019 వరకు నాలుగేళ్లదాకా అతడితో దెబ్బలు తిన్నాను. అన్నేళ్లు తిన్న దెబ్బలను ఆరోజు అతడికి తిరిగివ్వాలనిపించింది. తిరగబడ్డాను, కొట్టాను. 'ఇన్ని రోజులు నా పాప కోసం ఆలోచించి మర్యాద ఇస్తూ వచ్చాను. కానీ ఎప్పుడైతే నా బిడ్డ ఏడుస్తున్నా పట్టించుకోకుండా రాక్షసుడిలా మారి తన ముందే నన్ను కొట్టావు.. ఇకపై నీలాంటి తండ్రి తనకు అవసరం లేదు' అని ముఖం మీదే చెప్పాను. అతడిపై చేయి చేసుకున్నందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు. అయినా ధైర్యంగా నేను వెళ్లడం కుదరదు.. కావాలంటే నువ్వే వెళ్లిపో అని చెప్పాను' అంటూ తను అనుభవించిన నరకం గురించి చెప్పుకొచ్చింది.

కాగా ముల్లుమ్‌ మల్లురమ్‌ సీరియల్‌తో పాపులారిటీ తెచ్చుకున్న షాలిని సూపర్‌ మామ​ రియాలిటీ షోలోనూ మెరిసింది. ఆమె రియాజ్‌ను పెళ్లాడగా వీరికి రియా అనే కుమార్తె ఉంది. భర్త శారీరకంగా, మానసికంగా వేధించడంతో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇటీవలే న్యాయస్థానం విడాకులు మంజూరు చేయడంతో ఫోటోషూట్‌ నిర్వహించి మరీ సంబరాలు జరుపుకుంది నటి.

A post shared by shalini (@shalu2626)

చదవండి: వెకేషన్‌లో దిల్‌ రాజు కుమార్తె, ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు