KV Anand: ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్‌ కన్నుమూత

30 Apr, 2021 08:57 IST|Sakshi

సెలబ్రిటీల సంతాపం

గొప్ప డైరెక్టర్‌ ఇక లేరన్న వార్త బాధాకరం: అల్లు అర్జున్‌

సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ కేవీ ఆనంద్‌(54) తుది శ్వాస విడిచాడు. శుక్రవారం ఆయన చెన్నై ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించాడు. కాగా రెండు వారాల క్రితం ఆయన భార్య, కూతురు కోవిడ్‌ బారిన పడగా స్వీయనిర్బంధంలో ఉన్నారు. ఈ క్రమంలో కేవీ ఆనంద్‌ సైతం ఊపిరాడకపోవడం, ఛాతీ నొప్పి వంటి కరోనా లక్షణాలతో బాధపడ్డాడు. దీంతో తనే స్వయంగా కారు నడుపుకుంటూ చెన్నై ఆస్పత్రికి చేరగా అక్కడ గుండెపోటుతో కన్నుమూశాడు. అనంతరం వచ్చిన కోవిడ్‌ ఫలితాల్లో ఆనంద్‌కు పాజిటివ్‌ అని తేలింది.

ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 'డైరెక్టర్‌ కేవీ ఆనంద్‌ ఇక లేరన్న వార్తతో నిద్ర లేచాను. అద్భుతమైన కెమెరామన్‌, గొప్ప దర్శకుడు, మంచి మనిషిని కోల్పోయాం. ఆయనను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాం.. ఆయన కుటుంబానికి ఇదే నా ప్రగాఢ సానుభూతి' అని టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశాడు.

కేవీ ఆనంద్‌ ఫొటో జర్నలిస్టుగా కెరీర్‌ ఆరంభించాడు. గోపుర వాసలిలె, మీరా, దేవార్‌ మాగన్‌, మఅరన్‌, తిరుద తిరుద సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ దగ్గర అసిస్టెంట్‌గా వ్యవహరించాడు. 1994లో తొలిసారిగా మలయాళ మూవీ 'తెన్మావిన్‌ కోంబత్‌'కు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. తొలి సినిమాతోనే జాతీయ పురస్కారాన్ని సైతం అందుకున్నాడు.

సుమారు పదేళ్ల పాటు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన కేవీ ఆనంద్‌ 2005లో 'కన కందేన్‌' సినిమాతో దర్శకుడిగా మారాడు. అయాన్‌, కో, మాట్రాన్‌, అనేగన్‌, కవన్‌, కప్పాన్‌ సినిమాలకు సైతం డైరెక్షన్‌ చేశాడు. ఆయన తీసిన 'రంగం', 'శివాజీ' తమిళ చిత్రాలు తెలుగులోనూ రిలీజై ఎంతో పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. 'బందోబస్త్‌' సినిమా సైతం తెలుగులోనూ విడుదలైంది.

చదవండి: OTTకి మహర్దశ: కొత్తగా రిలీజయ్యే సినిమాలివే!

మరిన్ని వార్తలు