Director Mysskin: సందేశాత్మక చిత్రాలను మనం ఆదరించడం లేదు: డైరెక్టర్‌ ఆవేదన

10 Jan, 2023 13:50 IST|Sakshi

తమిళ సినిమా: సపర్బ్‌ క్రియేషన్స్‌ పతాకంపై నవ నిర్మాత రాజగోపాల్‌ ఇళంగోవన్‌ నిర్మించిన చిత్రం వెల్లిమలై. ఓం విజయ్‌ కథ బాధ్యతలను నిర్వహించారు. సీనియర్‌ నటుడు సపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ సుబ్రమణి ప్రధాన పాత్రలో నటించారు. నటి మంజు నాయకి. రఘునందన్‌ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అందరికీ అర్థమయ్యేలా సరళమైన భాషలో ఒక ముఖ్యమైన అంశాన్ని తెరపై ఆవిష్కరించిన చిత్రం వెల్లిమలై.

కాగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చెన్నైలోని కమలా థియేటర్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో నామ్‌ తమిళం పార్టీ నేత సీమాన్, దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ మిష్కిన్, పేరరసు, దిండుక్కల్‌ లియోన్‌ పలువురు సినీ ప్రముఖులు పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ చిత్రం కోసం దిండుక్కల్‌ లియోన్‌ ఒక పాట పాడటం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు మిష్కన్‌ మాట్లాడుతూ.. మంచి సందేశంతో కూడిన చిత్రాలను కూడా మనం ఆదరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటీటీలు వచ్చాక థియేటర్లో సినిమాలకు ఆదరణ కరువైందని, ఓటీటీలో సినిమా చూడటమంటే రౌడీయిజంతో సమానమంటూ ఆసక్తిక వ్యాఖ్యాలు చేశారు. ఇంతకుముందు మణికంఠన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి నిర్మించి ముఖ్య పాత్ర పోషించిన చిత్రం కడైసీ వ్యవసాయి అన్నారు. ఆ చిత్రానికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. కానీ మనం మాత్రం ఈ సినిమాను ఆదరించలేదన్నారు. రూ. 300, 400 కోట్లు బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాల మధ్య కడైసీ వ్యవసాయి చిత్రానికి రూ. 30 కోట్లు కూడా రాకపోవడం విచారకరమన్నారు. మంచి సందేశంతో వస్తున్న ఇలాంటి చిత్రాలు విజయం సాధించాలని మిష్కిన్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు