Tammareddy Bharadwaja: ఇంత అసహ్యంగానా? మరి అప్పుడెందుకు మాట్లాడలేదు?

10 Mar, 2023 18:09 IST|Sakshi

తెలుగు ఖ్యాతినే కాదు యావత్‌ భారతదేశ ఖ్యాతిని పెంచిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ కళాఖండానికి వేల కోట్ల కలెక్షన్లు వచ్చిపడ్డాయి. ఈ సినిమా నుంచి నాటునాటు పాట ఆస్కార్‌ రేసులో పోటీపడుతున్న విషయం తెలిసిందే! ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటూ అందరూ చప్పట్లు కొడుతుంటే ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.  ట్రిపుల్‌ ఆర్‌ ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు రూ.80 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బు తనకిస్తే ఎనిమిది సినిమాలు తీసి ముఖాన కొడతానంటూ కామెంట్లు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సహా పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో ఈ వివాదంపై స్పందించాడు తమ్మారెడ్డి భరద్వాజ. 'నేను ఒక సెమినార్‌లో పాల్గొని అక్కడి యంగ్‌ డైరెక్టర్స్‌తో దాదాపు మూడు గంటలు మాట్లాడాను. అందులో ఒక నిమిషం క్లిప్‌ విని ఎవరెవరో రియాక్ట్‌ అవుతున్నారు. ప్రస్తుతం చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ ప్రమోషన్‌ బడ్జెట్‌పై మాట్లాడాను. దీనిపై కొందరు చాలా దారుణంగా కామెంట్లు చేయడం బాధ కలిగించింది. ఒకరేమో అకౌంట్స్‌ సమాచారం అడుగుతారు. మరొకరేమో బూతులు తిడుతున్నారు. చాలా బాధగా, అసభ్యంగా, అసహ్యంగా ఉంది. వాళ్ల సంస్కారం వాళ్లది, నా సంస్కారం నాది. నేనేమీ గుర్తింపు కోసం పాకులాడటం లేదు. బహుశా నన్ను టార్గెట్‌ చేసకుఉని వాళ్లు గుర్తింపు కోరుకుంటున్నారో తెలీదు. నేను కొన్ని రోజుల ముందు రాజమౌళిని అభినందిస్తూ వీడియో పోస్ట్‌ చేశాను. మరి అప్పుడు ఏ ఒక్కరూ మాట్లాడలేదే?' అని విమర్శించాడు.

మరిన్ని వార్తలు