ఓటీటీలపై సెన్సార్‌ ఉండాలి: నిర్మాత

20 May, 2022 05:55 IST|Sakshi
కాశీ విశ్వనాథ్, ఆది శేషగిరిరావు, జీవిత, ఎన్‌.శంకర్‌.. తదితరులు

– తమ్మారెడ్డి భరద్వాజ

‘‘డిజిటల్‌ టెక్నాలజీ పెరగడంతో తంబ్‌నైల్స్, పైరసీ సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆరోపణలు వచ్చినప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. అంతేకానీ కొందరు లైక్‌లు, వ్యూయర్స్‌ కోసం నిర్మాతలు, నటులు, దర్శకులపై తంబ్‌నైల్స్‌ పెట్టి ఇబ్బంది పెట్టడం తగదు. యూట్యూబ్‌ తంబ్‌నైల్స్, పైరసీ చేసేవారిపై ఎలాంటి యాక్షన్‌ తీసుకోవాలో చర్చిస్తాం.. పైరసీ సెల్‌ను యాక్టివ్‌ చేస్తాం’’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినీ ఇండస్ట్రీవారిపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, పైరసీ వంటి విషయాలపై చర్చించేందుకు 24క్రాఫ్ట్స్‌ అధక్షులు, సెక్రటరీలు నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో గురువారం సమావేశమయ్యారు.

నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ– ‘‘ఓటీటీలపైనా సెన్సార్‌ ఉండాలి. ఓటీటీలో సినిమా వచ్చిన రోజు సాయంత్రానికల్లా సినిమా పైరసీ అవుతోంది. ఫిలిం చాంబర్‌ యాంటీ పైరసీ విభాగం డబ్బున్న వాళ్లకే పని చేస్తోంది.. పైరసీని అరికట్టడంలో ఫిలిం చాంబర్‌ పాత్ర శూన్యం’’ అన్నారు. ‘‘యూట్యూబ్‌కి కూడా సెన్సార్‌ విధానం తీసుకురావాలి’’ అని డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కాశీ విశ్వనాథ్‌ అన్నారు. ‘‘మా కుటుంబంపై వచ్చే అసత్య వార్తల వల్ల 25ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాను. మా కష్టాలను అర్థం చేసుకోండి’’ అని నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్‌ అన్నారు. ‘‘సోషల్‌ మీడియాలో ఎడిటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఉండదు.. వారికి ఇష్టమైంది రాసుకుంటున్నారు.. దీన్ని అరికట్టాలి’’ అన్నారు దర్శకుడు ఎన్‌. శంకర్‌.

మరిన్ని వార్తలు