షూటింగ్‌ ఆపితే ఊరుకునేది లేదు: టియ‌ఫ్‌సీసీ చైర్మన్‌ ఆర్‌.కె.గౌడ్‌

30 Jul, 2022 15:45 IST|Sakshi

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం ఆగస్ట్‌ 1న షూటింగ్స్‌ బంద్‌ చేయాలని టాలీవుడ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్స్‌ ఆపితే ఊరుకోబోమని తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు, నిర్మాత డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌ (ఆర్‌.కె. గౌడ్‌) హెచ్చరించారు. షూటింగ్స్‌ నిలివేత అంశంపై మాట్లాడేందుకు శనివారం తెలంగాణ ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ.. స్వార్థం కోసమే ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ షూటింగ్స్‌ నిలిపివేస్తుందని ఆరోపించారు.

‘తెలంగాణలో 50 మంది వరకు నిర్మాతలున్నారు. చాలా మంది చిత్రీకరణ చేస్తున్నారు. ఆగస్ట్‌ 1 నుంచి షూటింగ్స్‌ బంద్‌ అని గిల్డ్‌ నిర్మాతలు అంటున్నారు. ఎందుకు ఆపాలి? ఇదంతా వారి స్వార్థం కోసం చేస్తున్నదే తప్ప చిత్ర పరిశ్రమకు ఉపయోగపడేది కాదు. చిత్ర పరిశ్రమ నలుగురిది కాదు.. అందరినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. బంద్‌ ప్రకటిస్తే వర్కర్స్‌కు ఇబ్బంది అవుతుంది.

గిల్డ్‌ నిర్మాతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరికునేది లేదు. టికెట్ ధరలు పెంచుకుంది వారే.. ఇప్పుడు ధియేటర్ లకు ప్రేక్షకుల రావటం లేదని ఎడ్చేది వారే. ఆర్టిస్ట్ లకు రెమ్యూనిరేషన్ లు పెంచింది కూడా గిల్డ్‌ నిర్మాతలే. ఇంకొకరు ఎదగొద్దు అనేలా గిల్డ్ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. గిల్డ్‌ నిర్మాతలే ఓటీటీలకు తమ సినిమాలను ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇవన్ని తప్పులు వారు చేసి..ఇప్పుడు షూటింగ్‌ బంద్‌ అంటే ఎలా? బంద్‌ చేస్తే ఊరుకునేదే లేదు’అని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆర్‌.కె. గౌడ్‌ హెచ్చరించారు. టికెట్ రేట్లు తగ్గించి, పర్సంటేజ్ విధానం తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ వైస్ ప్రెసిడెంట్ ఏ.గురురాజ్ మాట్లాడుతూ... కొంత మంది సినిమా ఇండ‌స్ట్రీని శాసిస్తున్నారు. పెద్ద నిర్మాత‌లు, చిన్న నిర్మాత‌లు అంటూ ఎవ‌రూ లేరు. ప్ర‌తి ఒక్క‌రూ చిన్న నిర్మాత నుంచి పెద్ద నిర్మాత‌గా ఎదిగిన‌వారే. నేను కూడా చాలా చిత్రాలు నిర్మించాను. కానీ స‌రైన థియేట‌ర్స్ దొర‌క్క ఎంతో న‌ష్ట‌పోయాను. షూటింగ్స్ బంద్ చేయ‌డానికి మీకు అధికారం లేదు. సామాన్యుడు ప్ర‌స్తుతం సినిమా చూడాలంటే భ‌య‌ప‌డుతున్నాడు. కార‌ణం టికెట్ల రేట్లు, తినుబండారాల రేట్లు పెంచ‌డం. ముందు వీటిని త‌గ్గించండి. అంతే కానీ షూటింగ్స్ నిలిపేస్తే వ‌చ్చేది ఏం లేదు. ఎవ‌రైనా త‌మ షూటింగ్స్ ఆపార‌ని మ‌మ్మ‌ల్ని సంప్ర‌దిస్తే మేము ప్ర‌భుత్వం సపోర్ట్ తో వారిని ఎదుర్కొంటాం` అన్నారు.  ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో సెక్ర‌ట‌రి సాగ‌ర్, హీరో సురేష్ బాబు, చెన్నారెడ్డి, కిషోర్‌, స‌తీష్, రాఖీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు