‘దిశ’ మూవీ‌: రాంగోపాల్‌ వర్మకు నోటీసులు

16 Nov, 2020 19:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమా ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. దిశ తండ్రి దాఖలు చేసిన అప్పీలుపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. సెన్సార్ బోర్డు నిర్ణయం తీసుకోక ముందే కోర్టును ఎందుకు ఆశ్రయించారని ధర్మాసనం ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాల్లో ట్రైలర్‌ని విడుదల చేస్తున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు.. రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసింది. అలానే అనుమతులున్నాయో లేదో తెలుసుకొని చెప్పాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: ‘ఇది దిశ బయోపిక్‌ కాదు.. నిజాలు చెప్తున్నాం)

మరోవైపు దిశ ఎన్‌కౌంటర్ చిత్రం ఈ నెల 26న విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది నవంబర్ 26న షాద్ నగర్ సమీపంలో జరిగిన ఈ సామూహిక హత్యాచారాన్ని ఆధారంగా తీసుకొని దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదల చేశారు.

మరిన్ని వార్తలు