Movie News: మాలీ కాలింగ్‌

3 Feb, 2023 00:39 IST|Sakshi

తెలుగులో తెలుగు అమ్మాయిలు తప్ప ఇతర భాషల బ్యూటీలు ఎక్కువగా సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా అటు ముంబై ఇటు కేరళ భామల హవా ఎక్కువగా ఉంటుంది. అయితే తెలుగులో బాగా పాపులార్టీ తెచ్చుకున్న నాయికలు ఇప్పుడు మలయాళంకి వెళుతున్నారు. ఇద్దరు సీనియర్‌ హీరోయిన్లకు, ఒక యువ హీరోయిన్‌కు మాలీవుడ్‌ నుంచి కాల్‌ వెళ్లింది. మలయాళంలో ఈ ముగ్గురి తొలి చిత్రం గురించి తెలుసుకుందాం.

ఇండస్ట్రీకి వచ్చి పదిహేను సంవత్సరాలు దాటినా ఇంకా అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు తమన్నా. ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన తమన్నా వీలైనప్పుడు కన్నడ తెరపైనా మెరిశారు. అయితే మలయాళ వెండితెరపై మాత్రం కనిపించలేదు. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్ల తర్వాత తమన్నా ఫస్ట్‌ టైమ్‌ ఓ మాలీవుడ్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దిలీప్‌ హీరోగా అరుణ్‌ గోపీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాంద్రా’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారామె.

ఈ సినిమాలో తమన్నా మహారాణి పాత్రలో కనిపించనున్నారట. సో.. మాలీవుడ్‌కి రాణిలా ఎంటర్‌ అవుతున్నారన్న మాట. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్‌  కానుంది. కాగా దిలీప్‌ హీరోగా నటిస్తున్న మరో సినిమాతో టాలీవుడ్‌ బాపు బొమ్మగా ప్రేక్షకులు చెప్పుకునే కన్నడ భామ ప్రణీత కూడా మాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాకు రతీష్‌ రఘునందన్‌ దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్‌ కూడా మొదలైంది. అయితే ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్‌ పాత్రల్లోనే కనిపించిన ప్రణీత ఈ సినిమాలో మాత్రం కాస్త మాస్‌గా కనిపించనున్నారట.

క్యారెక్టర్‌ దృష్ట్యా ప్రణీత పాత్రకు కాస్త అహంకారం ఉంటుందట. సో.. ప్రణీత మాలీవుడ్‌ ఎంట్రీ మమమ్మాస్‌ అన్నమాట. ఈ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇక ఓ బిడ్డకు (కుమార్తె ఆర్నా) జన్మనిచ్చిన తర్వాత  ప్రణీత ఒప్పుకున్న తొలి సినిమా ఇదే. మరోవైపు టాలీవుడ్‌ బేబమ్మ (‘ఉప్పెన’లో కృతీ శెట్టి పేరు), యంగ్‌ బ్యూటీ కృతీ శెట్టికి కూడా మాలీవుడ్‌ నుంచి పిలుపొచ్చింది. మలయాళ యంగ్‌ హీరో టోవినో థామస్‌ నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా మూవీ ‘అజయంటే రందం మోషణం’లో కృతీ శెట్టి ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా,  ఐశ్వర్యా రాజేష్, సురభి లక్ష్మీ కూడా హీరోయిన్లుగా చేస్తున్నారు. మూడు యుగాల కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.
 

మరిన్ని వార్తలు