టాలీవుడ్‌లో తీవ్రవిషాదం: కరోనాతో సాయిబాలాజీ హఠాన్మరణం

28 Apr, 2021 00:03 IST|Sakshi
సాయిబాలాజీ (1963–2021) 

సినీరంగంలో మూడున్నర దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్‌ దర్శక, రచయిత సాయిబాలాజీ సోమవారం ఉదయం 5.10 గంటలకు హైదరాబాద్‌లో కరోనాతో శ్వాస అందక హఠాత్తుగా కన్నుమూశారు. సాయిబాలాజీగా సుపరిచితులైన ఆయన పూర్తి పేరు నక్కల వరప్రసాద్‌. స్వస్థలం తిరుపతి దగ్గర అలమేలు మంగాపురం. హీరో శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్‌ తమ్ముడు’, అలాగే ఉదయకిరణ్‌ ఆఖరి చిత్రం ‘జై శ్రీరామ్‌’లకు ఆయన దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు కొన్ని పాటలు కూడా రాశారు. చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’కి కథ, స్క్రీన్‌ప్లే సాయిబాలాజీవే! ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’ సీరియల్స్‌కూ ఆయన దర్శకత్వం వహించారు. 

దర్శకుడు రవిరాజా పినిసెట్టి శిష్యరికంలో మోహన్‌ బాబు ‘పెదరాయుడు’, బాలకృష్ణ ‘బంగారు బుల్లోడు’, వెంకటేశ్‌ ‘చంటి’ తదితర చిత్రాలకు సాయిబాలాజీ పనిచేశారు. రచయిత ఎమ్మెస్‌ నారాయణతో ‘పెదరాయుడు’లో పాత్ర వేయించి, తెర మీదకు తీసుకురావడంలో కీలకపాత్ర వహించారు. నటుడు నాగబాబుకు చెందిన అంజనా ప్రొడక్షన్స్‌ దర్శక, రచనా శాఖలో ఆయన పనిచేశారు. ముక్కుసూటితనం వెనుక మంచితనం మూర్తీభవించిన సాయిబాలాజీ సినీ రంగంలో నటుడు ప్రకాశ్‌రాజ్‌తో సహా పలువురికి ఇష్టులు. స్నేహితులైన దర్శకులు కృష్ణవంశీ, వై.వి.ఎస్‌. చౌదరి రూపొందించిన సినిమాలకు కథా విభాగంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

ప్రపంచ, భారతీయ సినీ కథ, కథనాలను గమనించి, నిశితంగా విశ్లేషించడంలో సాయిబాలాజీ దిట్ట. ఆర్థిక అండదండలు లేని ఆయన జీవనం కోసం సినిమా స్క్రిప్టులతో పాటు ఇటీవల కొన్ని వెబ్‌ సిరీస్‌ల  స్క్రిప్టులు సిద్ధం చేసుకుంటూ వచ్చారు. ఇంతలోనే కరోనా ఆయనను కబళించింది. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 57 ఏళ్ళ సాయిబాలాజీకి భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. కుటుంబసభ్యులు  ఇంట్లోనే కరోనా నుంచి కోలుకున్నా, ఆయన టిమ్స్‌ ఆసుపత్రిలో చివరి చూపైనా దక్కకుండా, ఆక్సిజన్‌ అందక ఆకస్మికంగా ప్రాణాలు వదలడం విషాదం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు