టాలివుడ్‌లో సీక్వెల్స్ జాతర..

28 Oct, 2021 00:33 IST|Sakshi

టాలివుడ్‌లో ఇప్పటి వరకు సీక్వెల్‌ సినిమాగా విడుదలైన ఏ చిత్రం పెద్దహిట్ సాధించిన చరిత్ర లేదు! బాహుబలి-2 మూవీ కొంతమేరకు సక్సెస్‌ అయినా అది సీక్వెల్ మాత్రం కాదనే చెప్పాలి. మొదటి భాగానికి కొనసాగింపు అంతే. అయితే ఇప్పుడు ఆ అనుభవాలను పక్కనబెట్టి మరీ వరసగా సీక్వెల్స్ చేస్తున్నారు తెలుగు దర్శకులు. దాదాపు 10 సినిమాలకు పైగా సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయిప్పుడు. ఆ సినిమాలేంటో ఓ సారి చూద్దాం..

అడవి శేష్ హీరోగా 2018లో వచ్చిన గూఢచారి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌గా గూఢచారి-2 చేస్తున్నాడు శేష్. హీరో నాని ప్రొడ్యూసర్‌గా విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన 'హిట్‌' సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.  ఆ సినిమాకు కూడా అడవి శేష్ హీరోగా సీక్వెల్‌ రూపొందిస్తున్నారు మేకర్స్‌. 

కింగ్ నాగార్జున ఆరేళ్ల క్రితం సోగ్గాడే చిన్నినాయనాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్ చేస్తానని నాగార్జున ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. మొత్తానికి బంగార్రాజు పేరుతో ఈ చిత్రం 2022 సంక్రాంతి బరిలో ఉన్నట్టు తెలుస్తోంది. 2021 ప్రథమార్ధంలో జాతి రత్నాలు సినిమాతో సెన్సేషనల్ హిట్‌ కొట్టిన దర్శకుడు అనుదీప్ సీక్వెల్ మూవీ చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు.

విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా ఎఫ్ 2తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి.. ఎఫ్-3 అంటూ సీక్వెల్ చేస్తున్నాడు. 2022 ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానున్నట్టు సమాచారం. 2014లో నిఖిల్‌ హీరోగా వచ్చిన కార్తికేయ ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రస్తుతం ఆ చిత్రానికి నిఖిల్‌తోనే సీక్వెల్ చేస్తున్నాడు దర్శకుడు చందూ మొండేటి. 

క్రాక్‌తో బంపర్‌ హిట్‌ కొట్టిన మాస్‌ మాహరాజ్‌ రవితేజ క్రాక్‌-2 చేయాలనుందని కోరగా దానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఓకే చెప్పాడు. పైగా సినిమా చివర్లో క్రాక్-2 ఎండ్‌ కార్డ్‌ వేసి హింట్ కూడా ఇచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇక ఇవేకాక మంచు విష్ణు హీరోగా 14 ఏళ్ల క్రితం వచ్చి సూపర్‌ హీట్‌గా నిలిచిన ‘ఢీ’ సినిమాకు ప్రస్తుతం విష్ణు హీరోగా సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు శ్రీను వైట్ల. త్వరలోనే ఆ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు