గణేషా.. ఒక్క సినిమా లేదు..ఎందుకిలా?

9 Sep, 2023 11:26 IST|Sakshi

పండుగ సీజన్‌ని మిస్‌ చేసుకుంటున్న తెలుగు సినిమాలు

వినాయక చవితికి ఒక్క తెలుగు సినిమా కూడా రావడం లేదు

పండగొచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడితో థియేటర్స్‌ కళకళలాడుతాయి. చిన్న పండుగల రోజు ఏమోగానీ సంక్రాంతి..వినాయక చవితి..దసరా..దీపావళి లాంటి  పెద్ద పండగ రోజు అయితే రెండు, మూడు పెద్ద సినిమాలతో పాటు ఒకటి రెండు చిన్న చిత్రాలు కూడా రీలీజ్‌ అవుతుంటాయి. ప్రతి ఒక్కరు ఈ పండుగ రోజుల్లో తమ సినిమాను విడుదల చేయాలనుకుంటారు. కొన్నిసార్లు పోటీ భారీగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్‌ బరిలోకి దిగుతారు. ఎందుకలా అంటే.. సినిమా యావరేజ్‌గా ఉన్నసరే పండుగ కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్‌ థియేటర్‌లకు వచ్చే చాన్స్‌ ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో వర్కౌట్‌ అయింది కూడా. అందుకే పండుగలపై చాలా సినిమాలు ముందే ఖర్చీఫ్‌ వేసుకుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వినాయక చవితి లాంటి పెద్ద పండగ రోజు ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కావడంలేదు. బంగారం లాంటి గణేష్‌ పండుగ డేట్‌ని వదిలేసి వేరే డేట్‌కి తమ చిత్రాలను రిలీజ్‌ చేస్తున్నారు. 

ముందే ఖర్చీఫ్‌.. చివరల్లో అలా
వాస్తవానికి ఈ వినాయక చవితికి చాలా సినిమాలు విడుదల కావాల్సింది. కొన్ని పెద్ద సినిమాలు ముందే డేట్‌ ఎనౌన్స్‌ చేయడంతో చిన్న సినిమాలు వెనక్కి తగ్గాయి. కానీ చివరి నిమిషంలో బడా చిత్రాలు సైతం చవితికి రాలేమని ప్రకటించాయి. బోయపాటి-రామ్‌ కాంబోలో తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీ ‘స్కంద’ సెప్టెంబర్‌ 15న విడుదల కావాల్సింది. కానీ కారణం ఏంటో తెలియదు.. సెప్టెంబర్‌ 28కి వాయిదా వేశారు.

ఇక రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ కలిసి నటించిన చంద్రముఖి-2 చిత్రం కూడా సెప్టెంబర్‌ 15న రిలీజ్‌ కావాల్సింది. అది కూడా వాయిదా పడింది. వీఎఫ్‌ఎక్స్‌ సన్నివేశాలు ఆలస్యం కావడం వల్లే సినిమా వాయిదా పడిందని చిత్రయూనిట్‌ పేర్కొంది. స్కంద రిలీజ్‌ రోజే చంద్రముఖి-2 రానుంది. అంటే సెప్టెంబర్‌ 28న ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్‌ వద్ద పోటీ పడతాయి. 

టిల్లన్న ఇలాగైతే ఎలాగన్నా?
పోటీ ఈ వినాయక చవితికి టిల్లుగాని డీజేకి చిందులేద్దామనుకుంటే.. అది కూడా జరగడం లేదు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్‌’ సెప్టెంబర్‌ 15న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్‌ ప్రకటించారు. కానీ అది కూడా మళ్లీ వాయిదా పడింది. ‘టిల్లు స్క్వేర్‌’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. క్వాలిటీ ఔట్‌పుట్‌ కోసం విడుదల వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అంటూ మేకర్స్‌ ప్రకటించారు.  

డబ్బింగ్‌ సినిమానే దిక్కు
వినాయక చవితికి ఒక్క తెలుగు సినిమా కూడా టాలీవుడ్‌లో విడుదల కావడంలేదు. డబ్బింగ్‌ సినిమాలనే తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాయి. అందులో చంద్రముఖి-2 వాయిదా పడింది. ఇప్పుడిక ఒకే ఒక్క డబ్బింగ్‌ మూవీ విడుదల కాబోతుంది. అదే మార్క్‌ ఆంటోని. విశాల్‌ నటిస్తున్న తమిళ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌కు పిచ్చ క్రేజ్‌ వచ్చింది. తెలుగులో కూడా విశాల్‌కు మంచి ఫాలోయింగ్‌. అందుకే ఈ చిత్రాన్నితెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తున్నారు. ఒకవేళ కొంచెం పాజిటివ్‌ టాక్‌ వచ్చిన చాలు..మార్క్‌ ఆంటోని పంట పండినట్లే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మంచి వీకేండ్‌ మిస్‌
ఈ సారి వినాయక చవితి సోమవారం వచ్చింది. ఇది  సినిమా వాళ్లకు బాగా కలిసొచ్చే రోజు. ఎందుంటే.. పండగతో కలిసి మొత్తం మూడు హాలిడేస్‌ వస్తున్నాయి. శుక్రవారం(సెప్టెంబర్‌ 15)సినిమాను విడుదల చేస్తే.. శని,ఆది వారాలతో పాటు సోమవారం కూడా సెలవు దినమే. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎక్కువగా థియేటర్స్‌కి వచ్చే అవకాశం ఉంది. సినిమాకు కాస్త పాజిటివ్‌ టాక్‌ వచ్చిన చాలు.. ఈ మూడు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ దాటొచు​. ఇంత మంచి వీకెండ్‌ని టాలీవుడ్‌ వదులుకుంది. 

మరిన్ని వార్తలు