Time Travel Movies In Telugu: తెలుగులో వచ్చిన 'టైమ్‌ ట్రావెల్‌' సినిమాలు ఇవే..

3 Dec, 2021 11:45 IST|Sakshi

Telugu Time Travel Movies And Web Series: భారతీయ సినీ ప్రపంచంలో అనేక రకాల సినిమాలు వచ్చాయి. అందులో ఎన్నో రకాల జోనర్లు ఉన్నాయి. అది ఏ జోనరైనా సరే ఆ జోనర్‌కు తగినట్టు చూపిస్తే చాలనుకుంటాడు సగటు సినీ ప్రేమికుడు. అలా ప్రేక్షకులు నచ్చే మెచ్చే జోనర్‌లలో ఒకటి 'టైమ్‌ ట్రావెల్‌' జోనర్‌. కాలంతో పాటు ప్రయాణం చేసే కథలు చాలా అరుదుగానే వస్తుంటాయి. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమాలు చేయడం అంటే అంతా ఆశామాషీ కాదు. దానికి అద్భుతమైన స్క్రిప్ట్‌, బోలెడంత బడ్జెట్‌తో పాటు ప్రేక్షకుడిని కన్విన్స్‌ చేసేలా కూడా ఉండాలి. అందుకే చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే ఈ టైమ్ ట్రావెల్ కథలతో సినిమాలు చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' నుంచి ఇటీవల వచ్చిన అద్భుతం సినిమా వరకు అలరించిన టైమ్‌ ట్రావెల్‌ చిత్రాలను చూద్దాం. 

1 - ఆదిత్య 369
నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఆదిత్య 369 చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోనే తొలి టైమ్‌ ట్రావెల్‌ చిత్రం. ఇందులో కృష్ణ కుమార్‌, శ్రీ కృష్ణదేవరాయలుగా రెండు పాత్రల్లో బాలకృష్ణ అదరగొట‍్టిన సంగతి తెలిసిందే. ఆగస్టు 18, 1991లో విడుదలైన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను హాలీవుడ్‌ చిత్రం 'బ్యాక్‌ టూ ఫ్యూచర్‌', హెచ్‌.జి. వెల్స్‌ రచించిన 'టైమ్‌ మేషీన్‌' పుస్తకం నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు.  

2 - 24
తమిళ స్టార్‌ హీరో సూర్య మూడు విభన్న పాత్రలతో మెప్పించిన చిత్రం 24. ఈ సినిమాను వైవిధ‍్య చిత్రాల దర్శకుడు కె. విక్రమ్‌ కుమార్‌ తెరకెక్కించారు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో వాచ్‌ రిపేరర్‌, సైంటిస్ట్, విలన్‌గా సూర్య అదరగొట్టారు. ఇందులో వాచ్ రూపంలో టైమ్‌ మేషీన్‌ ఉంటుంది. ఆ వాచ్‌ను రిపేర్‌ చేసే క్రమంలో టైమ్‌ మేషీన్ ద్వారా సూర్య గతంలోకి ప్రవేశిస్తాడు. 

3- ప్లే బ‍్యాక్‌
గతం నుంచి ప్రస్తుతానికి ఒక ఫోన్‌ లైన్‌ ద్వారా కనెక్షన్‌ ఏర్పడితే ఎలా ఉంటుందనేదే 'ప్లే బ్యాక్‌' సినిమా. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ వద్ద పనిచేసిన హరిప్రసాద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో దినేష్‌, అనన్య ప్రధానపాత్రల‍్లో నటించారు. వీరిలో ఒకరు 1993లో బ్రతికుంటే, మరొకరు 2019 కాలంలో జీవిస్తూ ఉంటారు. అయితే 26 ఏళ్ల టైమ్‌ గ్యాప్‌ ఉన్న ఈ పాత్రల మధ్య సంబంధం ఏంటీ ? ఫోన్‌ కాల్స్‌ ద్వారా గతంలో జరిగిన సంఘటనలో మార్పు తీసుకొస్తే ప్రస్తుతం, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో అని తెలిపేదే కథ. ఈ సినిమా ప్రస్తుతం 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

4 - అద్భుతం
తేజ సజ్జా, శివాని రాజశేఖర్‌ లీడ్‌ రోల్స్‌లో మాలిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన చిత్రం అద‍్భుతం. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న ఇద్దరు ఒక ఫోన్‌ కాల్‌తో విరమించుకుంటారు. అయితే ఇద్దరికీ ఒకే మొబైల్‌ నంబర్‌తో ఫోన్‌ కాల్‌ వస్తుండంతో ఆశ్చర్యానికి గురవుతారు. ఇలా ప్రారంభమైన సినిమా వాళ్లిద్దరూ వేరు వేరు సంవత్సరంలో జీవిస్తున్నారని తెలుస్తుంది. ఫ్లాష్‌ బ్యాక్‌ మూవీలో 26 సంవత‍్సరాలు టైమ్‌ గ్యాప్ ఉంటే ఇందులో ఐదేళ్ల గ్యాప్‌ ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనలను మార్చే నేపథ్యంతో సాగుతుందీ సినిమా. ఈ చిత్రం నవంబర్‌ 19, 2021లో హాట్‌స్టార్‌లో విడుదలైంది. 

5 - ఆ !
దర్శకుడిగా ప్రశాంత్ వర్మ తొలి చిత్రం ఆ !. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో నాని, ప్రశాంత్‌ తిపిర్నేని నిర్మించారు. ఇందులో కాజల్ అగర్వాల్‌, నిత్యా మీనన్‌, ఈషా రెబ్బ, రెజీనా కసాండ్ర, శ్రీనివాస్‌ అవసరాల, ప్రియ దర్శిని, మురళి శర్మ నటించగా, రెండు పాత్రలకు నాని, రవితేజ వాయిస్‌ ఇచ్చారు. అయితే ఈ సినిమా పూర్తి తరహా టైమ్‌ ట్రావెల్‌ చిత్రం కాదు. కానీ ఇందులో వాచ్‌మెన్‌ శివ పాత్ర సైంటిస్ట్‌ అవ్వాలనుకుంటాడు. సైంటిస్ట్‌ అయి టైమ్‌ మేషీన్‌ కనిపెట‍్టి ఎప్పుడూ చూడని తన తల్లిదండ్రులను కలవాలనుకుంటాడు. ఈ క్రమంలో అతని దగ్గరికి భవిష్యత్తు నుంచి పార్వతి అనే పాత్ర వస్తుంది. ఇలా ఈ పాత్రల ద్వారా టైమ్ ట్రావెల్‌ను చూపించాడు దర్శకుడు. అయితే పార్వతికి, శివకు ఉన్న రిలేషన్‌ ఏంటనేది మాత్రం సినిమాలో బెస్ట్‌ ట‍్విస్ట్‌. 

6 - కుడి ఎడమైతే 
టైమ్‌ ట్రావెల్‌ జోనర్‌లో వచ్చిన వెబ్‌ సిరీస్‌ కుడి ఎడమైతే. అమలాపాల్‌, ఈశ్వర్‌ రచిరాజు, రాహుల్‌ విజయ్‌ నటించిన ఈ వెబ్ సిరీస్‌లో టైమ్‌ లూప్‌ (Time Loop) గురించి వివరించారు. ఒకే సమయంలో ఆగిపోవడం. అంటే పాత్రలు, సంభాషణలు, సంఘటనలు రిపీట్‌ అవుతుంటాయన్నమాట. మల్టీపుల్‌ స్క్రీన్‌ ప్లే, కొత్త తరహా కథతో ఆకట్టుకున్నాడు దర్శకుడు పవన్‌ కుమార్. 

మరిన్ని వార్తలు