సీ'రియల్' కష్టాలు

4 Aug, 2020 08:21 IST|Sakshi

బడ్జెట్‌ అంచనాలు తారుమారు.. పెరిగిన భారం  

బిక్కు బిక్కుమంటూ  ఎపిసోడ్స్‌ చిత్రీకరణ 

షూటింగ్‌లో పలుమార్పులు తెచ్చిన కోవిడ్‌ 

దాదాపు 70 రోజుల లాక్‌డౌన్‌ అనంతరం సీరియళ్ల షూటింగ్‌కు ప్రభుత్వం అనుమతివ్వడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే  పరిమిత సంఖ్యలో ఆర్టిస్టులతో షూటింగ్‌ ప్రారంభమైన కొన్ని రోజులకే నటులకు కరోనా పాజిటివ్‌ తేలడంతో వెంటనే షూటింగ్స్‌ నిలిపివేశారు. మళ్లీ షూటింగ్స్‌ ప్రారంభమై నిర్విరామంగా కొనసాగుతుండగా నిర్మాతలు, ఆర్టిస్టులు, సిబ్బందికి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. షూటింగ్‌ ప్రాంతాన్ని అన్ని రకాలుగా శానిటైజేషన్‌ చేయడంతో పాటు నటీనటులతో పాటు ఇతర టెక్నిషియన్స్‌ పీపీఈ కిట్లతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

లక్డీకాపూల్‌: కోవిడ్‌19 మహమ్మారి ప్రభావం బుల్లితెర సీరియళ్లపై పడిందనే చెప్పవచ్చు.  షూటింగ్‌ చిత్రీకరణలో ఆహారపు అలవాట్లు, నిర్వహణలో కూడా పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో క్యాటరింగ్‌ ఫుడ్‌పై ఆధారపడిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు ఇప్పుడు పోషకాహారం, ప్రూట్స్, కషాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇది ఒక ఎత్తు అయితే కరోనా కష్టకాలంలో టీవీ సీరియల్స్‌ రంగానికి 30 శాతం మేరకు కార్మిక కొరత కూడా ఏర్పడింది. మరో పక్క  సీరియళ్ల నిర్మాణంలో బడ్జెట్‌ అంచనాలు 30 శాతం మేరకు పెరిగాయి. కాల్‌షీట్‌ టైమ్‌లో కూడా గంట, గంటన్నర కోత పడుతుంది. పైగా రోజుకి రూ. 15 నుంచి రూ. 20 వేల వరకు అదనపు ఖర్చు అవుతోంది. దీంతో ఒక్కొక్క  ఎపిసోడ్‌కి టీవీ చానల్స్‌ ఇచ్చే దానికంటే అదనపు  భారంపడుతున్నట్టు సమాచారం. ఈ కరోనా వైరస్‌ ఒక విధంగా నిర్మాతలకు ఆర్థిక భారంగా తయారైంది. షూటింగ్‌ లోకేషన్‌ మొత్తం రెండు సార్లు శానిటైజేషన్, సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌజ్‌ల సరఫరా అనివార్యమైంది. పైగా యూనిట్‌ సిబ్బందికి జీవిత బీమా సౌకర్యాన్ని సైతం కల్పిస్తున్నారు. ఇందుకు ఒక్కొక్క యూనిట్‌పైన సుమారు లక్ష రూపాయిలు అవుతున్నట్టు తెలుస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. బిక్కు బిక్కుమంటూ ఏపిసోడ్స్‌ చిత్రీకరణ కొనసాగుతుంది. అయినప్పటికీ పోటీ రంగంలో తట్టుకుని నిలబడేందుకు పలువురు ప్రొడ్యూసర్లు సతమతమవుతున్నారు. 

ఫ్రీగా పని చేసే పరిస్థితి లేదు.. 
షూటింగ్‌లో ఫ్రీగా పని చేసే పరిస్థితి లేదు. భయం భయంగానే షూటింగ్‌లు చేస్తున్నాం. పక్కనోళ్లు మామూలుగా దగ్గినా.. ఆందోళనపడాల్సి వస్తుంది. దాంతో షూటింగ్‌ లొకేషన్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్‌లో హీరో క్యారెక్టర్‌ చేస్తున్న తనకు ఆ క్యారెక్టర్‌ పేరు డాక్టర్‌ బాబు స్థిరపడేలా ఉంది. మా సీరియల్స్‌ పట్ల ప్రేక్షకులు అంతా ఇన్వాల్‌ అవుతున్నారు. ఏదిఏమైనా  కరోనా వల్ల షూటింగ్‌ స్పాట్‌లో ప్రొటీన్, హెల్దీ ఫుడ్‌తో పాటు ప్రూట్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. దాంతో పాటు కషాయం కూడా దొరుకుతుంది. కరోనాకు ముందు ఇలాంటి సదుపాయం లేదు. వాస్తవానికి నేనైతే అప్పుడు..ఇప్పుడు ఇంటి నుంచే ఫుడ్‌ తెచ్చుకుంటున్నాను. కరోనా తర్వాత ఇప్పుడు చాలా మంది కూడా అదే పాటిస్తున్నారు. ఆరోగ్యపరంగా కరోనా వల్ల మేలు జరిగిందనే చెప్పాలి.      – నిరుపం పరిటాల, బుల్లి తెర హీరో 

అన్నం పెట్టగలుగుతున్నాం.. 
కరోనా కష్టకాలంలో తెలుగు టీవీ సీరియళ్ల నిర్మాణం చాలా ఒడిదుడుగులను ఎదుర్కొంటోంది. అయితే హోటళ్లు, మాల్స్, థియేటర్ల వాళ్ల కన్నా మా పరిస్థితి చాలా బెటర్‌. లాక్‌ డౌన్‌ విరామం అనంతరం సీరియళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించినందుకు చాలా హ్యాపీగా ఉంది. కొంత మందికైనా అన్నం పెట్టగలుగుతున్నాం. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక ఈ రంగంపై ఆధారపడిన వాళ్లు అన్నానికి ఇబ్బంది పడ్డారని చెప్పడానికి చాలా బాధగా ఉంది. అలాంటి మళ్లీ సీరియల్స్‌ నిర్మించేందుకు అవకాశమిచ్చారు.  – గుత్తా. వెంకటేశ్వరరావు, కార్తీక దీపం సీరియల్‌ నిర్మాత 

చాలా టఫ్‌ జాబ్‌.. 
కరోనా నేపథ్యంలో షూటింగ్‌లు చేయడమంటే కష్టంతో కూడుతున్న అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా టఫ్‌ జాబ్‌. అయినప్పటికీ కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే షూటింగ్‌లు చేసుకునేందుకు మార్గదర్శకాలు చేశాం. ఆ దిశగా ఎక్కడ రాజీపడకుండా నిర్మాతలు టీవీ సీరియళ్లను తీసున్నారు. అయినా అవుట్‌ఫుట్‌ దెబ్బతింటోంది.   ప్రొడ్యూసర్‌ అప్పుడే కోల్కోలేదు. దాదాపుగా 30 శాతం లోటు బడ్జెట్‌తో సాగుతుంది.    – ఎన్‌.అశోక్, అధ్యక్షుడు, తెలుగు టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ 

మరిన్ని వార్తలు