2 నెలలు... 7 లక్షల టికెట్లు...

24 Dec, 2020 06:20 IST|Sakshi

దాదాపు ఏడు నెలల తర్వాత సినిమా థియేటర్లు మళ్లీ ఆరంభమైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో విడుదలైన తొలి సినిమా ‘టెనెట్‌’. క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ హాలీవుడ్‌ చిత్రాన్ని ఎక్కువమంది ప్రేక్షకులు చూశారని ‘బుక్‌ మై షో’ పేర్కొంది. అక్టోబర్‌ 16 నుంచి డిసెంబర్‌ 18 వరకూ ఈ సినిమా టికెట్లు 3 లక్షల వరకూ అమ్ముడుపోయాయని కూడా లెక్క చెప్పింది. థియేటర్ల రీ–ఓపెన్‌ తర్వాత మన దేశంలో ఇన్ని టికెట్లు తెగిన సినిమా ఇదేనంటూ ‘షో ఆఫ్‌ ది ఇయర్‌ –2020’ అనే తన రిపోర్ట్‌లో తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెరిచిన 2800 థియేటర్‌ స్క్రీన్లలో, ఈ రెండు నెలల్లో మొత్తం మీద 7 లక్షల టికెట్లు తెగినట్టు బుక్‌ మై షో వారి నివేదిక వివరించింది. ఎక్కువ మంది చూసిన చిత్రాలలో రెండు, మూడు స్థానాల్లో తమిళ సినిమా ‘బిస్కోత్‌’, ఆ తర్వాత ‘ఇరండామ్‌ కూత్తు’ నిలిచాయి. ఆ తర్వాత హిందీ చిత్రం ‘సూరజ్‌ పే మంగళ్‌ భారీ’, బెంగాలీ సినిమా ‘డ్రాకులా సార్‌’ టికెట్లు బాగా తెగాయి.

మరిన్ని వార్తలు