ముఖ్యమంత్రి జగన్‌ కి ధన్యవాదాలు

8 Apr, 2021 00:36 IST|Sakshi
సురేందర్‌రెడ్డి, దామోదర్, మోహన్, కల్యాణ్‌

గత ఏడాది ఏప్రిల్, మే, జూన్‌  నెలల విద్యుత్‌ ఛార్జీల చెల్లింపును రద్దు చేయడంతో పాటు ఆ తర్వాతి నెలల బిల్లును వాయిదా పద్ధతిలో చెల్లించే వెసులుబాటును థియేటర్ల యాజమాన్యాలకు కల్పిస్తూ మంగళవారం ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బుధవారం తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు సి. కల్యాణ్‌ మాట్లాడుతూ – ‘‘ఏపీలో  షూటింగ్స్‌ కోసం పర్మిషన్‌ కావాలని చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, నేను, దామోదర్‌ ప్రసాద్‌... ఇలా చాలామంది వెళ్ళి గత జూన్‌ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి గారిని కలిశాం. ఆయన కూడా వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారి తరహాలోనే ఏ నిర్ణయం అయినా వెంటనే చెప్పేస్తారు.

మేం తొమ్మిది నెలల కరెంట్‌ ఛార్జీలు రద్దు అడిగాం. అయితే ప్రభుత్వం మూడు నెలలు రద్దు చేస్తూ, జీవో ఇచ్చింది. మిగతా నెలల బిల్లును కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ కరోనా కష్టాలు మొదలయ్యాయి. వైజాగ్‌లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలన్నది వైఎస్‌ గారి డ్రీమ్‌. దానికి సంబందించిన అన్ని విషయాలూ పరిశీలిస్తున్నాం’’ అన్నారు. ఇంకా ఛాంబర్‌ గౌరవ కార్యదర్శి దామోదర ప్రసాద్, సంయుక్త కార్యదర్శి జి. వీరనారాయణ్‌ బాబు, తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌ తదితరులు మాట్లాడుతూ – ‘‘ఏ, బీ సెంటర్స్‌ థియేటర్స్‌ వారు తీసుకున్న రూ.10 లక్షలు, సి సెంటర్‌ థియేటర్స్‌ వారు తీసుకున్న రూ.5 లక్షల రుణాలపై వడ్డీ 50 శాతం మాఫీ చేయడం మంచి నిర్ణయం. ఆర్‌బీఐ ఇచ్చిన మారటోరియం 6 నెలల గడువు తర్వాత ఒక ఏడాది వరకు వడ్డీ ఉపసంహరణ వర్తిస్తుంది. థియేటర్స్‌ వారికి వెసులుబాటు కల్పించడంతో పాటు వేలాది సినీ కార్మికులకు తగిన జీవనోపాధి కలిగించేలా చేసిన జగన్‌ గారికి ధన్యవాదాలు. ఈ విషయాల్లో మాకు సహకరించిన హీరోలు చిరంజీవి, నాగార్జునలకు, మంత్రి పేర్ని నాని, ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌  చైర్మన్‌  విజయ్‌ చందర్, విజయ్‌ కుమార్‌ రెడ్డిలకు కృతజ్ఞతలు’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు