‘థియేటర్లలో సీటింగ్‌ సామర్థ్యాన్ని పెంచాలి’

5 Jan, 2021 15:35 IST|Sakshi

100 శాతం సీటింగ్‌కుకు అనుమతి ఇవ్వాలి

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నిర్మాతల మండలి లేఖ

సాక్షి, హైదరాబాద్‌  : తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లలో సీటింగ్‌ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుకోడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలనకు తెలుగు సినిమా నిర్మాతల మండలి లేఖ రాసింది. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు గత కొద్దిరోజుల క్రితం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడపడం వల్ల థియేటర్ల నిర్వహణకు ఎక్కవ ఖర్చు అవుతుందని, దీని వల్ల థియేటర్ల యాజమాన్యాలు నష్టాలను భరించాల్సి వస్తుందని నిర్మాతల మండలి పేర్కొంది. సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతంకు పెంచుతూ, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లు నడుపుకునేందుకు అనుమతిస్తున్నట్లు జనవరి 4న తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: థియేటర్లలో ఎంజాయ్‌ చేద్దాం: ప్రభాస్‌

కరోనా కేసులు రోజురోజుకి తగ్గుతున్న క్రమంలో థియేటర్ల యాజమాన్యాలు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకుని తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, తమిళనాడు తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ 100 శాతం సీటింగ్ కెపాసిటీతో చిత్ర ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలంటూ నిర్మాతల మండలి కోరింది. ఇందుకు లేఖల ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ విభాగాధిపతులను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సినిమా థియేటర్ల నిర్వహణకు, సినీ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది. 

మరిన్ని వార్తలు