కంగనాకు ఆ పేరైతే సరిగ్గా సరిపోయేది

23 Mar, 2021 00:00 IST|Sakshi

కంగనా రనౌత్‌ అసలు పేరు వార్తలమ్మ అని పెడితే సరిపోయేది. ఒకటీ ఆమె వార్త సృష్టిస్తుంది. లేదా ఆమే వార్త అవుతుంది. ఎప్పుడూ మీడియాలో ఉన్నవాళ్లకే మార్కెట్‌ అని ఆమె కనిపెట్టింది. పలుచగా ఉండే శరీర స్వభావంతో ఉండే ఈ నటి బొద్దుగా ఉండే జయలలిత పాత్రను పోషించడానికి శారీరకంగా ట్రాన్స్‌ఫామ్‌ కావడం, అందుకు శ్రమ పడటం ఆమె వృత్తిగత ప్రతిభను చాటుతుంది. ఆమెను ‘న్యూసెన్స్‌’ అని అనేవారు కూడా ఈ టాలెంట్‌ను అంగీకరిస్తారు. కంగనా నేడు (మార్చి 23) 35వ ఏట అడుగుపెట్టనుంది.

రేపు ‘తలైవి’ ట్రైలర్‌ కంగనా పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది. ‘ఈ పాత్ర కోసం 20 కేజీల బరువు పెరిగి కొద్ది నెలల్లో అంత బరువూ తగ్గాను. అయితే సినిమా కోసం ఇదొక్కటే నేను ఎదుర్కొన్న సవాలు కాదు’ అని కంగనా కొన్ని సినిమా స్టిల్స్‌ను పోస్ట్‌ చేస్తూ వ్యాఖ్యానించింది. ఆ ఫొటోల్లో సినిమా నటిగా జయలలిత చేసిన పాత్రల్లాంటి వాటిలో కంగనా గెటప్స్‌ ఉన్నాయి. అచ్చు జయలలితను పోలి ఉండటంతో అటు జయలలిత అభిమానులు, ఇటు కంగనా అభిమానులు సంతోషపడుతున్నారు. కంగనా ఎంత ప్రతిభావంతురాలో వివాదాల్లో కూడా అంతే ప్రముఖురాలు. ఏదో ఒక కారణం చేత ఆమె తరచూ వార్తల్లో ఉంటుంది.


‘తలైవి’లో కంగనా రనౌత్‌ 

హృతిక్‌ రోషన్‌తో ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత ఇతర హీరోయిన్లపై సూటిపోటి మాటలు, మహారాష్ట్ర ప్రభుత్వంతో పేచీ, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికే వ్యాఖ్యలు... ఇవన్నీ ఆమెను న్యూస్‌లో ఉంచుతున్నాయి. అయితే న్యూస్‌లో ఉంచాల్సింది ఆమె నటనా ప్రతిభే అని ఆమె మర్చిపోతున్నట్టుంది. ‘లైఫ్‌ ఇన్‌ ఏ మెట్రో’, ‘ఫ్యాషన్‌’, ‘తనూ వెడ్స్‌ మను’, ‘క్వీన్‌’, ‘మణికర్ణిక’ లాంటి మంచి సినిమాల్లో ఆమె పాత్రలు వెలిగాయి. వంద కోట్ల కలెక్షన్లు సాధించడానికి హీరో అక్కర్లేదు అని నిరూపించిందామె. మూడుసార్లు జాతీయ ఉత్తమనటిగా నిలవడం సామాన్య విషయం కాదు. ఇప్పుడు నాలుగో జాతీయ అవార్డును కూడా దక్కించుకుంది. ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాల్లోని నటన ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కేలా చేసింది. 

తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా పద్దెనిమిదేళ్ల వయసులో డెహ్రాడూన్‌ నుంచి ఒంటరిగా ఢిల్లీ చేరుకుని రకరకాలుగా స్ట్రగుల్‌ అయి, ముంబై చేరుకుని ఒకరి అండ లేకుండా స్టార్‌గా మారిందామె. ఆమెకు రాజకీయ అభిప్రాయాలు రాజకీయ జీవితం పట్ల ఆసక్తి ఉంటే దానికి ఇంకా టైమ్‌ ఉందని పరిశీలకులు అనుకోవచ్చు. ఇప్పుడైతే ఆమె నుంచి ఆశిస్తున్నది గొప్ప సినిమాలే. తనలోని గొప్ప నటికి ఆమె ఎక్కువ పని చెప్పాలని ఫ్యాన్స్‌ కోరుకుంటే వారి కోరిక సబబైనదే అనుకోవచ్చు. 


‘మణికర్ణిక’లో కంగనా రనౌత్‌

నా అవార్డు వాళ్లది కూడా! – కంగనా రనౌత్
మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ, ‘పంగా’ సినిమాల్లో నా నటనకు నేషనల్‌ అవార్డు వచ్చిందని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది. ‘మణికర్ణిక’ సినిమాను నేను డైరెక్ట్‌ కూడా చేశాను. జ్యూరీ మెంబర్స్‌తో పాటు చిత్రబృందం అందరికీ ధన్యవాదాలు. నా అవార్డు వీరిది కూడా. నా అభిమానులందరికీ ధన్యవాదాలు.

మళ్లీ మళ్లీ అవార్డ్స్‌
తాజాగా ఉత్తమ నటిగా ఎంపికైన కంగనా రనౌత్‌ గతంలో ఉత్తమ సహాయ నటిగా (చిత్రం ‘ఫ్యాషన్‌’) ఒకసారి, ఉత్తమ నటిగా రెండు సార్లు (‘క్వీన్‌’, ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’) అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు ఆమెకిది 4వ నేషనల్‌ అవార్డు. ధనుష్‌కు ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు రావడం ఇది 2వ సారి. గతంలో వచ్చిన ‘ఆడుకాలమ్‌’కూ, ఇప్పుడు అవార్డు తెచ్చిన ‘అసురన్‌’కూ – రెండింటికీ దర్శకుడు వెట్రిమారన్‌ కావడం విశేషం. ఇక, ఉత్తమ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌కి ఇది 3వ జాతీయ అవార్డు. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరంకు ఇది 2వ నేషనల్‌ అవార్డు. గతంలో ‘జనతా గ్యారేజ్‌’  (‘ప్రణామం...’ పాటకు), ఇప్పుడు ‘మహర్షి’ – ఇలా ఆయనకు జాతీయ గౌరవం తెచ్చిన రెండు చిత్రాలూ తెలుగువే కావడం విశేషం.

మరిన్ని వార్తలు