అజిత్‌ వర్సెస్‌ విజయ్‌.. సూపర్‌స్టార్‌ ఎవరు? కోలీవుడ్‌లో ఫ్యాన్స్‌ రచ్చ

8 Jan, 2023 08:20 IST|Sakshi

తమిళసినిమా: సూపర్‌స్టార్‌ ఎవరన్న విషయంపై కోలీవుడ్‌లో పెద్ద వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. విజయ్‌ కథానాయకుడిగా వారిసు చిత్రాన్ని నిర్మించిన దిల్‌రాజు విజయ్‌కు అజిత్‌ కంటే ఎక్కువ మాస్‌ ఫాలోయింగ్‌ ఉందని, ఆయనే నంబర్‌వన్‌ అని ఆ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు. అదే వేదికపై నటుడు శరత్‌కుమార్‌ మాట్లాడుతూ.. భవిష్యత్తు సూపర్‌స్టార్‌ విజయ్‌ అని తాను సూర్యవంశం విజయోత్సవ వేదికపైనే చెప్పానని.. అది నిజమైందని పేర్కొన్నారు. అది ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో డిబేటింగ్‌ వరకు వెళ్లింది.

ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్‌ ఉన్నంత వరకు ఆయనే సూపర్‌స్టార్‌ అని సీనియర్‌ నటుడు, నిర్మాత కె.రాజన్‌ పేర్కొన్నారు. నామ్‌ తమిళర్‌ పార్టీ నేత సీమాన్‌ మాత్రం నేటి సూపర్‌స్టార్‌ విజయ్‌ అని తెలిపారు. ఈ చర్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కాగా ఈ విషయమై నటుడు శరత్‌కుమార్‌ ఒక చానల్లో మాట్లాడుతూ.. తాను విజయ్‌ సూపర్‌స్టార్‌ అని సంబోధించానే కాని రజనీకాంత్, అజిత్‌ సూపర్‌స్టార్‌లు కాదని చెప్పలేదన్నారు. రజనీకాంత్‌తో పాటు అజిత్, అమితాబచ్చన్, షారూక్‌ఖాన్‌ వీళ్లంతా సూపర్‌స్టార్లేనని శరత్‌కుమార్‌ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

అదే విధంగా సూపర్‌స్టార్‌ అన్నది ఒక టైటిల్‌ కాదని పేర్కొన్నారు. దీని గురించి ఇకపై వివాదం చేయాలన్న ఆలోచన లేదని, దీనిని వివరించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. అదే విధంగా తాను విజయ్‌ ముఖ్యమంత్రి అవుతారనో, మంత్రి అవుతారనో చెప్పలేదని, సూపర్‌స్టార్‌ అవుతారని చెప్పానని అన్నారు. జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వారంతా సూపర్‌స్టార్లే అని పేర్కొన్నారు. సూర్యవంశం చిత్ర వేడుకలలో చెప్పిందే ఇప్పుడూ చెబుతున్నానని, రియల్‌ సూపర్‌స్టార్‌ అంటే ఎప్పటికీ ఎంజీఆర్‌నే అని శరత్‌కుమార్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు