Thaman First Remuneration: నా తొలి సంపాదన రూ. 30, ఆ సినిమాకు పనిచేస్తే ఇచ్చారు

22 Dec, 2021 13:25 IST|Sakshi

నాన్న చనిపోతే వచ్చిన డబ్బుతో డ్రమ్స్‌ కొన్నాను: తమన్‌

సంగీత దర్శకుడు తమన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తమన్‌ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఏ స్టార్‌ హీరో సినిమా అయిన దానికి సంగీత దర్శకుడు ఎవరు అంటూ తమన్‌ పేరే వినిపిస్తోంది. అంతేకాదు హీరోలు, డైరెక్టర్లు కూడా తమన్‌తోనే పని చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతగా ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ మ్యూజిక్‌ సన్సెషన్‌ ఈ స్థాయికి ఊరికే రాలేదని, దాని వెనక ఎంతో కష్టం ఉందని చెప్పాడు. ఇటీవల ఓ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్య్వూలో తమన్‌ మాట్లాడుతూ ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

చదవండి: సుకుమార్‌పై నెటిజన్లు ఫైర్‌, ఆ వెబ్‌ సిరీస్‌ను కాపీ కొట్టాడా?

ఈ క్రమంలో తన తొలి సంపాదన 30 రూపాయలని చెప్పాడు. ఈ మేరకు తమన్‌.. ‘మా నాన్న డ్రమ్స్ చాలా బాగా వాయించేవారు.. ఆయన చాలా సినిమాలకి పనిచేశారు. అందువలన సహజంగానే నాకు డ్రమ్స్ వాయించడం పట్ల ఆసక్తి పెరుగుతూ పోయింది. ఒకసారి మేమంతా ఢిల్లీలోని మా అత్తయ్య ఇంటికి వెళ్లి ట్రైన్ లో వస్తుండగా, మా నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ట్రీట్మెంట్ ఆలస్యం కావడంతో ఆయన చనిపోయారు. నాన్న చనిపోవడంతో ఆయన ఎల్ఐసి పాలసీకి సంబంధించి 60 వేల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బును ఇంట్లో వాడకుండా మా అమ్మ నాకు డ్రమ్స్ కొనిపెట్టింది. ఆ డ్రమ్స్‌తో నేను సాధన చేస్తూ డ్రమ్మర్‌గా ముందుకు వెళ్లాను.

చదవండి: Pushpa Movie: అల్లు అర్జున్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ క్రమంలో నేను డ్రమ్మర్‌గా పనిచేసిన తొలి చిత్రం ‘భైరవద్వీపం’. ఆ సినిమాకి పని చేసినందుకు నాకు 30 రూపాయలు పారితోషికంగా ఇచ్చారు. అలా డ్రమ్మర్‌గా నా తొలి సంపాదనగా 30 రూపాయలు సంపాదించాను’ అని చెప్పుకొచ్చాడు. కాగా అఖండ సినిమాకు తమన్‌ అందించిన మ్యూజిక్‌ ఎంత సన్సెషన్‌ అయ్యిందో తెలిసిందే. తమన్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ మాస్‌ బీజీయంకు ఆమెరిక బాక్సాఫీసు సైతం దద్దరిల్లింది. కాగా ప్రస్తుతం తమన్ ‘భీమ్లా నాయక్’​​ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’, వరుణ్ తేజ్​ ‘గని’, అఖిల్​ ‘ఏజెంట్’తో పాటు శంకర్​ దర్శకత్వంలో రామ్​ చరణ్ నటిస్తున్న సినిమాకు కూడా తమన్ స్వరాలు అందిస్తున్నాడు.

మరిన్ని వార్తలు