థ్రోబ్యాక్‌ వీడియో షేర్‌ చేసిన సంగీత దర్శకుడు

25 Sep, 2020 11:21 IST|Sakshi

కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ తీవ్ర అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు థమన్‌ ఎస్పీబీకి సంబంధించిన ఓ అరుదైన వీడియో షేర్‌ చేశారు. ఆయన కోసం ప్రార్థించాల్సిందిగా జనాలను కోరారు. లాక్‌డౌన్‌ విధించిడానికి ముందు తీసిన వీడియో ఇది. దీనిలో ఎస్పీబీ, మనో, మణిశర్మ, డ్రమ్స్‌ శివమణితో పాటు థమన్‌ కూడా ఉన్నారు. వీడియోతోపాటు ‘ఇది లాక్‌డౌన్‌కు ముందు నా ప్రియమైన మామాతో మార్చిలో తీసిన వీడియో. బాలసుబ్రహ్మణ్యం గారు ఈ వీడియో చూస్తే నాకు కన్నీరాగడం లేదు. బాలుగారి కోసం ప్రార్థన చేద్దాం. నాకు మీ అందరి మద్దతు కావాలి’ అనే క్యాప్షన్‌తో వీడియో షేర్‌ చేశారు థమన్‌. నిజంగానే ఇది చూసిన వారికి కన్నీరాగడం లేదు.( నా ఆయుష్షు కూడా ఇచ్చి కాపాడాలి: నటి)

గురువారం సాయంత్రం అకస్మాత్తుగా బాలసుబ్రహ్మణ్యం అపస్మారక స్థితికి వెళ్లిపోయారని, ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా సమాచారంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యం బాలు ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో బాలు గత నెల 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ‘నా ఆరోగ్యం బాగానే ఉంది. ఎవరూ కంగారుపడాల్సిన  అవసరంలేదు. పరామర్శించడానికి ఫోన్లు చేయొద్దని విన్నవించుకుంటున్నాను’అని ఫేస్‌బుక్‌ ద్వారా ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అప్పటినుంచి ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు