Anasuya Bharadwaj: ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ మూవీ రివ్యూ

7 May, 2021 10:13 IST|Sakshi
Rating:  

టైటిల్‌: థ్యాంక్‌ యు బ్రదర్‌
న‌టీటులు: అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, , అనీశ్‌ కురువిల్లా, ఆదర్శ్ బాలకృష్ణ, మోనికా రెడ్డి, వైవా హర్ష తదితరులు
నిర్మాణ సంస్థ :  జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాత‌లు: మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి
ద‌ర్శ‌క‌త్వం:  రమేశ్ రాపర్తి
సంగీతం:  గుణ బాలసుబ్రమణియన్
సినిమాటోగ్ర‌ఫీ : సురేష్ ర‌గుతు
విడుదల తేది :  మే 07, 2021(ఆహా)


బుల్లితెర ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో పాటు తనదైన యాంకరింగ్‌తో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది.  పేరుకు యాంకర్ అయినా కూడా హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్, అందం ఈమె సొంతం. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో వైవిధ్యమైన  పాత్రలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది అనసూయ. చాలా కాలం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. ఇందులో ప్రెగ్నెంట్‌ లేడీ గెటప్‌లో కనిపించి అందరికి షాకిచ్చింది ఈ అందాల యాంకర్‌. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ.. శుక్రవారం (మే 7)న ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో విడుదలైంది. టీజర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌  రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ‘థ్యాంక్‌యు బ్రదర్‌’ ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ
అభి (విరాజ్ అశ్విన్ ) జీవితంపై అస్సలు బాధ్యతలేని గొప్పింటి కుర్రాడు. తల్లి ప్రేమను అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంటాడు. తల్లి ఎన్నిసార్లు మందలించిన తన ప్రవర్తనను మార్చుకోడు. తన అవేశం, లెక్కలేనితనం కారణంగా ఎన్నో తప్పులు చేస్తుంటాడు. ఒకానొక సమయంలో తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటాడు. కట్‌ చేస్తే... ప్రియ(అనసూయ భరద్వాజ్‌) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ. నిండు గర్భిణి. అప్పటికే తన భర్త చనిపోయి ఉంటాడు. అత్తమ్మతో కలిసి కుట్లు, అల్లికలు చేసూకుంటూ జీవనాన్ని సాగిస్తుంది. ఇలా ఒకరికొకరు ఎలాంటి సంబంధంలేని అభి, ప్రియ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుపోతారు. అదే సమయంలో ప్రియకు నొప్పులు వస్తాయి. ఎలాంటి బాధ్యత లేకుండా తిరిగే అభి, ప్రియను ఎలా సేవ్‌ చేశాడు?  లిఫ్ట్‌లోనే బిడ్డకు జన్మనిచ్చిన ప్రియ క్షేమంగా ఉందా? లేదా?. ప్రియ ఘటన అభిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేదే మిగతా కథ.

నటీనటులు
అనసూయ భరద్వాజ్ గ్లామర్ రోల్సే కాదు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసి ఇప్పటికే తానేంటో నిరూపించుకుంది. ఈ మూవీలో కూడా మరోసారి తనలో దాగి ఉన్న ప్రతిభను బయటపెట్టింది. ప్రియ పాత్రలో అద్భుతంగా నటించి సినిమా మొత్తం తానై నడిపిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా  డెలివరీ అయ్యే సీన్‌లో తనదైన నటనతో అందరిని భావోద్వేగానికి గురయ్యేలా చేసింది. ఇక  హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ తన పాత్రకు న్యాయం చేశాడు. బాధ్యత లేకుండా తిరిగే గొప్పింటి కుర్రాడు అభి పాత్రలో జీవించాడు. ఇది వరకు కొన్ని సినిమాల్లో నటించినా విరాజ్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ సినిమాతో ఆ లోటు తీరుతుంది. కమెడియన్ వైవా హర్ష ఒకటి రెండు చోట్ల నవ్వించేప్రయత్నం చేశాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. 

విశ్లేషణ
గర్భవతి అయిన ఓ మహిళ.. తల్లి విలువ తెలుసుకోలేని ఓ కొడుకు. వీరిద్దరూ లిఫ్ట్ లో వెళుతుంటే అది ఆగిపోతుంది. అంతలో ఓ విపత్కర పరిస్థితి ఎదురవుతుంది. దానిని ఎలా పరిష్కరించారనేదే ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’నేపథ్యం.  పాయింట్ పరంగా మంచి కంటెంట్ ఎంచుకున్న దర్శకుడు.. దానిని తెరపై చూపించడంలో కాస్త విఫలమయ్యాడు. మూవీలో వచ్చే కీలక సన్నివేశాలను తెరపై ఆవిష్కరించిన విధానం అంతగా ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్‌ అంతా బోల్డ్‌ సీన్స్‌, లవ్‌ట్రాక్‌తో సోసోగా నడిపించి సెకండాఫ్‌లో అసలు కథని చూపించాడు.

ఈ సినిమాకు ఉన్నంతలో ప్రధాన బలం సెకండాఫ్‌. అయితే సెకండాఫ్‌లో కూడా కొన్ని సీన్స్‌ని ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా తీర్చిదిద్దే స్కోప్‌ ఉన్నప్పటీకీ దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు. తల్లి సెంటిమెంట్‌తో సాగే ఈ సినిమాలో ఆమె పాత్రని కూడా బలంగా తీర్చిదిద్దలేకపోయాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గుణ బాలసుబ్రమణియన్ నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సీన్లకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. సురేష్ ర‌గుతు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌
అనసూయ, విరాజ్ అశ్విన్ నటన
లిఫ్ట్‌లోని సీన్స్
క్లైమాక్స్‌

మైనస్‌ పాయింట్స్‌
స్లో నేరేషన్
ఫస్టాఫ్‌
సెకండాఫ్‌లో కొన్ని  సాగదీత సీన్స్‌
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.25/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు