సినిమా థియేటర్లను ఆదుకోవాలి

4 Oct, 2020 06:51 IST|Sakshi

‘‘కోవిడ్‌ కారణంగా ఆర్నెళ్లుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఈ నెల 15 నుంచి 50 శాతం సీట్లు నిండేలా థియేటర్లు ప్రారంభించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా థియేటర్లు తెరుచుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు పెద్ద మనసుతో అనుమతించాలి’’ అని ‘తెలంగాణ థియేటర్ల సంఘం’ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శనివారం పలువురు థియేటర్‌ యజమానులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ థియేటర్ల సంఘం’ ప్రతినిధులు మాట్లాడుతూ– ‘‘థియేటర్లు మూత పడటంతో తీవ్రంగా నష్టపోయాం.

ఎన్నో వేల మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపరు. కనీసం సగం సీట్లు నిండినా మాకు సంతోషమే. ప్రేక్షకులకు కోవిడ్‌ సోకకుండా శానిటైజర్లతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. టికెట్లు చేతితో తాకకుండా చూసుకుంటాం. విశ్రాంతి సమయంలో ఒకేసారి ఎక్కువ మంది గుమిగూడకుండా చర్యలు చేపడతాం. థియేటర్లకు ఎక్కువ కరెంటు బిల్లులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ఆదుకుంటేనే సినిమా థియేటర్ల పరిశ్రమ పూర్వవైభవం తెచ్చుకుంటుంది’’ అన్నారు. 

మరిన్ని వార్తలు