ద‌స‌రాలోపు థియేట‌ర్లు రీఓపెన్ చేసుకుంటాం!

11 Sep, 2020 19:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షలతో వ్యాపారం లేక తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న థియేటర్ యజమానులు థియేట‌ర్ల పునఃప్రారంభానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు.  కనీసం అక్టోబర్‌లో దసరానాటికైనా తమ వ్యాపారంసాగాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ భారతదేశంలోని థియేటర్ యజమానులు దసరాకి ముందు థియేటర్లను తిరిగి తెరవడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండు ప్రాంతాల్లోని  ఫిల్మ్ ట్రేడ్ సభ్యులు, సినిమా, మల్టీప్లెక్స్ యజమానులు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులను కలిసారు. వారిచ్చిన హామీ మేరకు రానున్న రెండు రోజుల్లో మంచి వార్త తమ చెవిన పడుతుందని ఆశిస్తున్నారు. 

ఈ ఏడాది అనేక లాభదాయకమైన సెలవు వారాంతాలను కోల్పోయిన  చిత్ర పరిశ్రమ  రానున్న పండుగ సీజన్ ముఖ్యంగా దసరా, దీపావళి  రాబడిపై ఆశలు పెట్టుకుంది. ఇన్నాళ్లుగా క‌రోనా ఎఫెక్ట్ తో తీవ్ర న‌ష్టాల్లో ఉన్న వినోద‌రంగాన్ని కొంత గాడిలోకి తీసుకురావాలంటే ద‌స‌రా, దీపావ‌ళి సీజ‌న్ లో థియేట‌ర్లు ఓపెన్ చేస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నారు యాజ‌మానులు. 50 శాతం కెపాసిటీతో థియేట‌ర్లు రీఓపెన్ చేసుకునే అవ‌కాశ‌మివ్వాల‌ని ప్రభుత్వాన్ని కోరారు. మూసి ఉండే ఆడిటోరియంలో వైర‌స్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న ఆందోళన నేపథ్యంలో ఈ మేరకు  అభ్యర్థించినట్టు  తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్  సునీల్ ఎన్ నారంగ్ తెలిపారు. 

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారని, థియేటర్  మూత వల్ల తమకు ఎదురయ్యే భారీ నష్టాల గురించి  చర్చించామని  సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ అన్నారు. అక్టోబర్ ఒకటవ తేదీనాటికి తిరిగి తెరవడానికి అనుమతిని కోరినట్టు తెలిపారు. సినిమా థియేటర్లను తిరిగి ప్రారంభించే అంశానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు కూడా సిద్ధంగా ఉన్నాయని, హోం మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నామని ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ ఖరే గత వారం గ్లోబల్ ఏవీజీసీ సమ్మిట్ ఫర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ)లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో థియేటర్ యజమానులు ముందుకు కదిలారు. దీంతో దసరా నాటికి థియేటర్లు తెరుచు కుంటాయనే ఆనందం అభిమానుల్లో నెలకొంది. ‌కరోనామ‌హ‌మ్మారి కారణంగా దాదాపు గత ఆరు నెలలుగా థియేట‌ర్లు మూత‌పడిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయ థియేటర్ వ్యాపారం 3,000 కోట్ల రూపాయల మేర నష్టపోయినట్టు అంచనా. అయితే, థియేటర్లు తిరిగి తెరిచినా, ఆడటానికి కంటెంట్ లేదని ఫిల్మ్ ట్రేడ్ అండ్ ఎగ్జిబిషన్ నిపుణుడు గిరీష్ జోహార్ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు