దసరదా లేదు

24 Oct, 2020 00:46 IST|Sakshi

సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి వంటివి ఇండస్ట్రీకు చాలా ఇష్టమైన సీజన్లు. ఈ సమయంలో థియేటర్స్‌ నిండుగా ఉంటాయి. సినిమా ఆడితే లాభాలు మెండుగా ఉంటాయి. పండగలే ఫ్యామిలీలను థియేటర్స్‌కు కదిలిస్తాయి. అయితే ఈ ఏడాది కోవిడ్‌ వల్ల సమ్మర్‌ పోయింది. చాలా గ్యాప్‌ తర్వాత ఇటీవలే థియేటర్స్‌ తెరిచారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు థియేటర్స్‌లో లేరు. దసరాకి కూడా థియేటర్స్‌ బిజినెస్‌కు సందడి లేనట్టే.

కొత్త సినిమాలేవి?
థియేటర్స్‌కి ప్రేక్షకులు రావాలంటే కొత్త సినిమా ఉండాలి. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నట్టు అనిపిస్తేనే కొత్త సినిమా విడుదల చేయగలం అన్నట్లుంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి. పాత సినిమాలను ప్రదర్శిస్తూ థియేటర్స్‌ను నడిపిస్తున్నారు. అయితే వస్తున్న ప్రేక్షకుల సంఖ్య వేళ్ల మీద లెక్కెట్టొచ్చు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈజీగా మూడు కొత్త రిలీజ్‌లు ఉండే సీజన్‌ దసరా. ఈసారి ఒక్కటీ లేదు. కొత్త సినిమాలు ఎప్పుడు విడుదలకు సిద్ధం అవుతాయో అర్థం కాని పరిస్థితి. సినిమాలన్నీ సంక్రాంతికి సిద్ధం చేసే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.

డిజిటల్‌ దసరా
థియేటర్స్‌ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న నేపథ్యంలో ఓటీటీకి బాగా డిమాండ్‌ పెరిగిన సంగతి తెలిసిందే. థియేటర్స్‌ ప్రారంభించినప్పటికీ ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్‌లు, షోలు విరివిగా విడుదలవుతున్నాయి. బాలకృష్ణ దర్శకత్వంలో ‘నర్తనశాల’ అనే చిత్రం అప్పట్లో ప్రారంభం అయింది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పూర్తికాలేదు. సౌందర్య, శ్రీహరి ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే చిత్రీకరించిన కొంత భాగాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు. సుహాస్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘కలర్‌ ఫోటో’ ఆహాలో విడుదలయింది. సూపర్‌హిట్‌ సిరీస్‌ ‘మిర్జాపూర్‌’కి సీక్వెల్‌గా ‘మిర్జాపూర్‌ 2’ తాజాగా అమేజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. టబు, ఇషాన్‌ కట్టర్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ‘ఎ సూటబుల్‌ బాయ్‌’ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇలా సినిమాలు, సిరీస్‌లతో డిజిటల్‌లో దసరా సందడి కనబడుతోంది.

సందడి మళ్లీ సంక్రాంతికేనా?
దీపావళి, క్రిస్మస్‌ సీజన్‌లోనూ కొత్త సినిమాలు విడుదలవుతున్నట్టు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఆల్రెడీ రానా నటించిన ‘అరణ్య’ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. అలాగే అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ తదితర చిత్రాలు కూడా పండగకి రానున్నాయి. మరి.. కొత్త సినిమాలతో సంక్రాంతికైనా థియేటర్లు కళకళాలాడతాయా? చూడాలి.

మరిన్ని వార్తలు