ఈ టైమ్‌లో ఇలాంటి సినిమాలే అవసరం

11 Feb, 2022 05:23 IST|Sakshi

‘‘డిజె టిల్లు’ యూత్‌ఫుల్‌ సినిమానే కానీ అడల్ట్‌ చిత్రం కాదు. ముద్దు సీన్స్‌ కూడా అడల్ట్‌ కిందకు వస్తాయనుకుంటే ఎలా? నేటి తరం అమ్మాయి కోణంలో సాగే చిత్రమిది. టిల్లు అనే అమాయకుణ్ణి రాధిక ఎలా ఆడుకుంటుందనేది వినోదాత్మకంగా ఉంటుంది’’ అని సూర్యదేవర నాగవంశీ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా విమల్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిజె టిల్లు’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగవంశీ విలేకరులతో చెప్పిన విశేషాలు...

► ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ సినిమా చూశాక సిద్ధు జొన్నలగడ్డను పిలిచాను. ‘డిజె టిల్లు’ అనే యూత్‌ఫుల్‌ కథ చెప్పాడు. ఈ కథ వింటున్నంత సేపూ నవ్వుకున్నాను.. సినిమా చూసి ప్రేక్షకులు కూడా ఫుల్‌గా నవ్వుకుంటారు. మేము ఓ కథ ఓకే అనుకున్నాక డైరెక్టర్‌ త్రివిక్రమ్‌గారికి చెబుతాం. ఆయన కథలో మార్పులు, సలహాలు చెబుతారు. ‘డిజె టిల్లు’ పూర్తయ్యాక కూడా త్రివిక్రమ్‌గారు చెప్పడంతో కొన్ని సన్నివేశాలు మళ్లీ తీశాం.

► కరోనా టైమ్‌లో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. మేం నిర్మించిన ‘రంగ్‌ దే, వరుడు కావలెను’ చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎక్కువగా రాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని రప్పించాలంటే ‘డిజె టిల్లు’లాంటి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాలే అవసరం. ఈ సినిమాకు సీక్వెల్‌ చేసే ఆలోచన ఉంది. ప్రస్తుతం మా బ్యానర్‌లో తీస్తున్న ‘స్వాతిముత్యం, ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలు కూడా ఇన్నోవేటివ్‌ అప్రోచ్‌తో చేస్తున్నవే.

► ‘భీమ్లా నాయక్‌’ పెద్ద సినిమా కాబట్టి ఏపీలో థియేటర్లలో 100 శాతం సీటింగ్, సెకండ్‌ షోకి అనుమతి ఉన్నప్పుడే విడుదల చేస్తాం. టిక్కెట్‌ ధరల విషయం సమస్య కాదు. అన్నీ బాగుంటే ఈ నెల 25నే ‘భీమ్లా నాయక్‌’ను రిలీజ్‌ చేస్తాం.

మరిన్ని వార్తలు