ప్రేక్షకులు ఎక్కడ?

17 Oct, 2020 00:11 IST|Sakshi

వందల్లో వసూళ్లు

షోలు రద్దు

నిండుగా ఉంటేనే థియేటర్స్‌కి అందం. థియేటర్స్‌ నడిపేవారికి ఆనందం. థియేటర్‌ గేట్‌కి హౌస్‌ఫుల్‌ బోర్డ్‌కి మించిన మెడల్‌ ఏముంటుంది? అయితే కరోనా థియేటర్స్‌ బిజినెస్‌ను బాగా దెబ్బకొట్టింది. ఏడు నెలలు ఖాళీగా, సందడి లేకుండా ఉండిపోయాయి హాళ్లు. థియేటర్స్‌ మళ్లీ తెర్చుకోండి, కానీ కొన్ని షరతులు అంది ప్రభుత్వం. 50 శాతం మించి ఆడియన్స్‌కు అనుమతి లేదు. అక్టోబర్‌ 15న దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యాయి. మరి థియేటర్స్‌కి ప్రేక్షకులు వచ్చారా? పరిస్థితి ఏంటి? చూద్దాం.

లాక్‌డౌన్‌ సమయంలో సినిమా హాళ్లు మూసివేసి ఉన్నప్పుడు, ప్రేక్షకులు వస్తారో రారా అనేది పక్కనపెడితే ముందైతే థియేటర్స్‌ తెరవాలి, దాన్ని నమ్ముకున్నవాళ్ల పరిస్థితి ఏంటి? అనే వాదనలు వినిపించాయి. జాగ్రత్తలు తీసుకుందాం, జనమే అలవాటు పడతారు అనే ధైర్యం కూడా ఉంది థియేటర్స్‌ యాజమాన్యంలో. అక్టోబర్‌ 15నుంచి థియేటర్స్‌ తెరుచుకోమని, గైడ్‌లైన్స్‌ ఇచ్చింది ప్రభుత్వం. 50 శాతం సీట్లకు మాత్రమే అనుమతి ఉండడంతో కొత్త చిత్రాలేవీ రిలీజ్‌ చేయలేదు. గతంలో విడుదలైన చిత్రాలనే మళ్లీ ప్రదర్శిస్తూ థియేటర్స్‌ను ప్రారంభించారు. చాలా ప్రాంతాల్లో మునుపటికంటే టికెట్‌ రేట్‌ చాలా తగ్గించారు. ప్రేక్షకులను థియేటర్స్‌కి ఆకర్షించే భాగంలో ఇదొకటì . అయితే థియేటర్స్‌కి వస్తున్న ప్రేక్షకుల సంఖ్య చాలా చాలా తక్కువ ఉండటం  షాక్‌కి గురి చేస్తోంది. పలు చోట్ల పట్టుమని పదిమంది కూడా కనిపించలేదట.

ఢిల్లీలో...
ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాస్‌ ప్రాంతంలో కోవిడ్‌ గైడ్‌లైన్స్‌తో థియేటర్‌ గేట్లు తెరిచారు. 300 సీటింగ్‌ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్లో 150 వరకు అనుమతిస్తూ, టికెట్‌ కౌంటర్‌ వద్ద సిబ్బంది టికెట్లు తెంచడానికి రెడీ అయ్యారు. ఏడు నెలలవుతోంది, టికెట్లు చింపి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినవాళ్లకు చిన్న షాక్‌ తగిలింది. కేవలం ఐదుగురు మాత్రమే సినిమా చూడటానికి వచ్చారు. ఇంకెవరైనా వస్తారని అరగంట ఆగారు. ఉహూ... వచ్చిన ఆ ఐదుగురికి సినిమా వేశారు. ‘ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే కుతూహలంతోనే వచ్చాను’ అని సమాధానమిచ్చాడో ప్రేక్షకుడు. గురువారం మ్యాట్నీ షో పరిస్థితి ఇది. శుక్రవారం కుటుంబంతో కలసి సినిమా చూడాలని ముందు రోజు టికెట్స్‌ బుక్‌ చేసుకోవడానికి ఆ థియేటర్‌కి వచ్చిన వ్యక్తి, ‘ఇంకా ఇంట్లోనే ఉంటే మానసికంగా ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. అందుకే థియేటర్లో సినిమా చూడాలనుకున్నాం’ అనడం విశేషం.

వైజాగ్‌లో..
వైజాగ్‌లో వరుణ్‌ ఐనాక్స్, పూర్ణ అనే థియేటర్‌ను ఓపెన్‌ చేశారు. ‘అల వైకుంఠపురములో, భీష్మ’ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రేక్షకుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇక్కడ కూడా ప్రేక్షకుల సంఖ్య పదికి దాటలేదు. వైజాగ్‌లో రాత్రి 7 గంటల షో ఎప్పుడూ హౌస్‌ఫుల్‌. అది కూడా ఏడుగురుకంటే ఎక్కువ మంది లేరట. ఇలా షోకి వెయ్యి రూపాయిల వసూళ్లు కూడా రావడంలేదట. ఓ మూడు పాత ఇంగ్లిష్‌ సినిమాలను రిలీజ్‌కి రెడీ చేసి, ప్రేక్షకులు రాకపోవడంతో షోలు రద్దు కూడా చేశారని సమాచారం.

ఖర్చులు కూడా మిగలవు
థియేటర్స్‌లో ఒక్క షో వేస్తే... తెగిన టికెట్లు, కరెంటు బిల్లులు, థియేటర్‌ రెంటు ఇలా ప్రతీది లెక్క కట్టుకుని మిగిలినది లాభం. ఇక వసూళ్లు వెయ్యి రూపాయిలైతే కరెంటు బిల్లు ఖర్చులు కూడా రావు. ఇలా నడపడమెందుకు? అనే ఆలోచన కూడా రాకమానదు. ఈ క్లిష్ట పరిస్థితి గురించి చర్చించడానికి థియేటర్స్‌ యూనియన్‌కి సంబంధించి త్వరలో ఓ మీటింగ్‌ జరిగే అవకాశం ఉందని తెలిసింది. పాత సినిమాలు కదా, థియేటర్స్‌కి ఏం వెళ్తాం అని ప్రేక్షకులు భావిస్తున్నారా? కరోనా టైమ్‌లో ఇంటిపట్టున ఉండటం బెటర్‌ అనుకుంటున్నారా? కొత్త సినిమాలు పడితే థియేటర్స్‌ వైపు నడుస్తారా? థియేటర్స్‌కు మళ్లీ పూర్వ వైభవం ఎప్పుడు? ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నలే.

మరిన్ని వార్తలు