Thegimpu Telugu Movie Review: అజిత్‌ ‘తెగింపు’ మూవీ ఎలా ఉందంటే..

11 Jan, 2023 12:23 IST|Sakshi
Rating:  

టైటిల్‌: తెగింపు
నటీనటులు: అజిత్‌, మంజు వారియర్‌, జాన్‌ కొక్కెన్‌, యోగి బాబు, సముద్రఖని, మహానది శంకర్‌ తదితరులు
నిర్మాత : బోనీ కపూర్‌
దర్శకుడు: హెచ్‌.వినోద్‌
సంగీతం: జిబ్రాన్‌
సినిమాటోగ్రఫీ: నిరవ్‌ షా
విడుదల తేది: జనవరి 11, 2022

Ajith Thegimpu Movie Review In Telugu

కథేంటంటే..
బ్యాంకు దోపిడి ఇతివృత్తంగా ‘తెగింపు’సినిమా కథనం సాగుతుంది. విశాఖపట్నంలోని ‘యువర్‌ బ్యాంక్‌’లో రూ.1000 కోట్ల మాత్రమే నిల్వ ఉంచడానికి అనుమతి ఉండగా.. నిబంధనలకు విరుద్దంగా మరో 500 కోట్లను డిపాజిట్‌ చేస్తారు. ఆ 500 కోట్ల రూపాయలను కొట్టేయడానికి ఏసీపీ ప్రవీణ్‌(అజయ్‌) ప్లాన్‌ చేస్తాడు. అతని మనుషులు బ్యాంక్‌లోకి వెళ్లగా..అక్కడ అప్పటికే డార్క్‌ డెవిల్‌ చీఫ్‌(అజిత్‌) ఉంటాడు. అతను కూడా తన టీమ్‌తో కలిసి డబ్బును కొట్టేసేందుకు బ్యాంకుకు వస్తాడు. అతని టీమ్‌లో మొత్తం ఐదుగురు ఉంటారు. వారిలో  రమణి(మంజు వారియర్‌) ఒకరు. ఆమె బయట ఉండి టెక్నాలజీ సాయంతో అజిత్‌కు అన్ని విషయాలు చేరవేస్తుంది. అసలు డార్క్‌ డెవిల్‌ గ్యాంగ్‌ యువర్‌ బ్యాంకుని ఎందుకు టార్గెట్‌ చేసింది? డబ్బులను కొట్టేయాలనే ప్లాన్‌ ఎవరిది?  ఏసీపీ ప్రవీణ్‌ వెనుక ఉన్నదెవరు? బ్యాంకు యజమాని క్రిష్ (జాన్ కొక్కెన్‌) అధినేతగా ఉన్న యువర్ బ్యాంక్‌లోకి రూ.25000 కోట్ల రూపాయలు ఎలా వచ్చి చేరాయి? ఈ స్కామ్‌లో ఉన్నదెవరు? చివరకు అజిత్‌ టీమ్‌ ఇచ్చిన ట్విస్ట్‌ ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘తెగింపు’ సినిమా చూడాల్సిందే. 

Thegimpu Movie Cast

ఎలా ఉందంటే..
బ్యాంకు దోపిడి నేపథ్యంలో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. తెగింపు కూడా ఆ కోవలోకి చెందిన సినిమానే. బ్యాంకులను అడ్డం పెట్టుకొని కొంతమంది ఎలాంటి స్కామ్‌లు చేస్తున్నారనేది ఈ సినిమాలో చూపించారు. ఈ పాయింట్‌తో ఇటీవల మహేశ్‌ బాబు సర్కారువారి పాట సినిమా కూడా వచ్చింది. అయితే ఈ సినిమా కథనం వేరేలా సాగుతుంది. ఫుల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు వినోద్‌. ఫస్టాఫ్‌లో కథ ఏమి ఉండదు కానీ.. ఒక్కో పాత్రని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవడంతో అసలు బ్యాకింగ్‌ రాబరీ వెనక ఉన్నదెరనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుంది.

మొత్తం మూడు గ్యాంగ్‌లు బ్యాంక్‌ దోపిడికి ప్లాన్‌ చేయడం.ఒక్కో గ్యాంగ్‌ వెనుక ఊహించని వ్యక్తులు ఉండడంతో కథనం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఫస్టాఫ్‌లో కథ కంటే..ఫైటింగ్‌ సీన్సే ఎక్కువ. బ్యాంకులోకి వెళ్లడానికి పోలీసులు ప్లాన్‌ చేయడం..దానిని హీరో గ్యాంగ్‌ తిప్పికొట్టడం..ఇలానే సాగుతుంది. ఆ ఫైటింగ్‌ సీన్స్‌ చూస్తే విజయ్‌ ‘బీస్ట్‌’ సినిమా గుర్తొస్తుంది. అక్కడ హీరో షాపింగ్‌మాల్‌లో ఫైట్‌ చేస్తే..ఇక్కడ బ్యాంకులో చేస్తాడు. భారీ యాక్షన్‌ సీన్స్‌తో ఫస్టాఫ్‌ని కొంత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.ఇక సెకండాఫ్‌లో కథ మాత్రం చాలా రోటీన్‌గా సాగుతుంది.  ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌ సినిమాకు మైనస్‌.

ఎమోషనల్‌ సన్నివేశాలు  కూడా వర్కౌట్‌ కాలేదు. క్లైమాక్స్‌ కూడా చాలా రొటీన్‌గా ఉంటుంది. దర్శకుడు కథను పట్టించుకోకుండా హీరోయిజంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. అజిత్ సినిమాలు చాలా కాలంగా కేవలం హీరోయిజాన్ని, స్టంట్ లను నమ్ముకుని తీసేస్తున్నారు. ఈ ‘తెగింపు’ కూడా అలాంటిదే. అజిత్‌ వీరాభిమానులకు నచ్చుతుంది. 

Thegimpu Movie Rating And Highlights

ఎవరెలా చేశారంటే..
అజిత్‌ ఎప్పటిలాగే యాక్షన్‌ సీక్వెన్స్‌ అదరగొట్టేశాడు. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. మంజు వారియర్‌కి మంచి పాత్ర లభించింది. డార్క్‌ డెవిల్‌ టీమ్‌ మెంబర్‌గా ఆమె తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా..తనదైన నటనతో ఆకట్టుకుంది. యాక్షన్‌ సీస్స్‌లో అదరగొట్టేసింది. కమిషనర్‌ పాత్రలో సముద్రఖని ఒదిగిపోయాడు. కానీ అతని పాత్రకి సరైన జస్టిఫికేషన్‌ ఇవ్వకపోవడంతో సినిమాపై ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేయలేదు. నెగెటివ్‌ షేడ్‌ ఉన్న ఏసీపీ ప్రవీణ్‌గా అజయ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరనటించారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే.. జిబ్రాస్‌ సంగీతం సినిమాకు ప్రధాన బలం. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది.  తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అలాగే  నిరవ్‌ షా సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు చాలా ప్లస్‌. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు