ఆలోచింపజేసే చిత్రం

14 Dec, 2020 05:55 IST|Sakshi

‘‘తెరవెనుక’ సినిమా ట్రైలర్‌ బాగుంది. ఒక ఆడపిల్ల తండ్రి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చినప్పుడు, ఓ లేడీ పోలీస్‌ వివరించే విధానం బాగుంది. మహిళలపై జరుగుతున్న అంశాలను ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది’’ అని తెలంగాణ పోలీసు ఉన్నతాధికారిణి సుమతి (డీఐజీ – ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌) అన్నారు. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ కథానాయకుడిగా, విశాఖ ధిమాన్, దీపికా రెడ్డి కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘తెర వెనుక’.

నెల్లుట్ల ప్రవీణ్‌ చంద్ర దర్శకత్వంలో జయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళీ జగన్నాథ్‌ మచ్చ నిర్మించారు. ఈ సినిమా ఆడియోను డీఐజీ సుమతి విడుదల చేయగా, దర్శకుడు ఎన్‌.శంకర్, సుచిర్‌ ఇండియా లయన్‌ కిరణ్, నిర్మాత గురురాజ్, సంఘసేవకుడు రేగొండ నరేష్, నటుడు శివారెడ్డి తదితరులు పాటలను విడుదల చేశారు. ఈ నెల 25న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. నెల్లుట్ల ప్రవీణ్‌ చంద్ర మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న సంఘటనలను తీసుకొని ఈ సినిమా చేశాను. సామాజిక స్పృహ కలిగిన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందించాం’’ అన్నారు. ‘‘ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రమిది’’ అన్నారు మురళీ జగన్నాథ్‌ మచ్చ.

మరిన్ని వార్తలు