షారుఖ్‌ 'పఠాన్‌' సెట్స్‌లో కొట్టుకున్నారా?

20 Jan, 2021 20:35 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పఠాన్'‌ సినిమా సెట్స్‌లో ఘర్షణ జరిగిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. దర్శకుడు సిద్దార్థ్‌ ఆనంద్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో వాగ్వాదానికి దిగడమే కాకుండా చాచి కొట్టాడని పుకార్లు వ్యాపించాయి. దీనిపై అదే సెట్స్‌లో ఉన్న ఓ వ్యక్తి స్పందిస్తూ ఈ వార్తలన్నీ నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. అందులో ఇసుమంత నిజం కూడా లేదని స్పష్టం చేశారు. సిద్దార్థ్‌ తన టీమ్‌తో అన్యోన్యంగా మెదులుతారని, వాళ్లు కూడా ఇతడిని బాస్‌లా కాకుండా సొంత అన్నలా భావిస్తారని చెప్పుకొచ్చారు. నిజానికి సెట్స్‌లో అసలు ఏం జరిగిందనేది పూస గుచ్చినట్లుగా వెల్లడించారు. చదవండి: ఆ హీరోయిన్‌ నాలుక కోసేయండి : పొలిటీషియన్‌)

"లైన్‌మెన్‌ తన పని తాను చేస్తున్న సమయంలో స్వల్పంగా గాయపడ్డాడు. అదృష్టం బాగుండి అదేమంత పెద్ద గాయం కాదు. కానీ అక్కడే ఉన్న ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ దుష్ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో దాన్ని వీడియో తీయడం మొదలు పెట్టాడు. అలా చేయకూడదని సిద్ధార్థ్‌ హెచ్చరించాడు. అయినా సరే అతడు సీక్రెట్‌గా వీడియో తీస్తూనే ఉన్నాడు. ఇలాంటివి చాలా సున్నితమైన అంశాలు కావడంతో సిద్‌ వెంటనే అతడి ఫోన్‌ను ఇచ్చి సెట్స్‌ నుంచి బయటకు వెళ్లిపోమన్నాడు. తప్పు చేసిందే కాక ఆ జూనియర్‌ ఆర్టిస్ట్‌ తిరగబడ్డాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని వెంటనే అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు. ఇదీ అక్కడ జరిగింది. అంతే కానీ ఎవరూ దెబ్బలాడుకోలేదు. చెంపదెబ్బలు చరుచుకునేంతగా కొట్టుకోలేదు" అని చెప్పుకొచ్చారు. పఠాన్‌లో దీపికా పదుకోన్‌, జాన్‌ అబ్రహాం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. (చదవండి: విడాకుల తర్వాత సంతోషంగా ఉన్నాను: నటి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు