Tollywood Heroes: కథ, డైలాగులు రాసేస్తున్న హీరోలు.. అట్లుంటది వీళ్లతోని!

16 Jun, 2022 07:53 IST|Sakshi

కెమెరా ముందు నటులుగా విజృంభిస్తున్నారు...  కెమెరా వెనకాల రచయితలుగా కలం పడుతున్నారు. యువహీరోలు అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, నవీన్‌ పొలిశెట్టి, కిరణ్‌ అబ్బవరం, విశ్వక్‌ సేన్‌ రచయితలుగా కథలు.. డైలాగులు రాస్తున్నారు.. నాయకులుగా నటిస్తున్నారు. ఈ ‘కథా’నాయకుల కథ తెలుసుకుందాం. 

‘మేజర్‌’ సినిమాతో తాజాగా మరో హిట్‌ అందుకున్నారు అడివి శేష్‌. తాను హీరోగా నటించిన ‘క్షణం, గూడఛారి’ వంటి సినిమాలకు కథ, స్క్రీన్‌ ప్లే అందించారు శేష్‌. ‘క్షణం’, ‘గూఢచారి’ మంచి విజయాలు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌గా అడివి శేష్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మేజర్‌’. ఈ చిత్రానికి శేష్‌ అద్భుతమైన కథ అందించారు. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయవంతంగా సాగుతోంది. ఇలా శేష్‌ కథలు అందించిన ‘క్షణం, గూఢచారి, మేజర్‌’ సినిమాలు హిట్స్‌గా నిలవడం విశేషం. ఇటు రైటింగ్‌.. అటు యాక్టింగ్‌లో శేష్‌ మేజర్‌ హిట్స్‌ చూశారు.

అట్లుంటది మనతోని
‘అట్లుంటది మనతోని...’  అంటూ ‘డీజే టిల్లు’లో హీరో సిద్ధు జొన్నలగడ్డ చేసిన సందడికి యూత్‌ ఫిదా అయిపోయారు. ఈ చిత్రానికి కథ, మాటలు అందించి రైటర్‌గానూ సూపర్‌ హిట్‌ అందుకున్నారు సిద్ధు. ‘డీజే టిల్లు’ ఇచ్చిన హిట్‌తో ఈ చిత్రానికి సీక్వెల్‌ కూడా రెడీ చేస్తున్నారు సిద్ధు. కాగా  సిద్ధు హీరోగా నటించిన ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ చిత్రం 2020 జూన్‌లో ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్‌ అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కథ–స్క్రీన్‌ప్లే అందించారు సిద్ధు. ఈ యువహీరో కథ ఇచ్చిన రెండు సినిమాలూ హిట్‌ కావడం విశేషం.

ఆత్రేయ కథ అదిరింది
‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు నవీన్‌ పొలిశెట్టి. ఈ రెండు చిత్రాల్లో హీరోగా నటించగా, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’కు కథ, స్క్రీన్‌ ప్లే అందించారు నవీన్‌. ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది.

మాస్‌ కా దాస్‌
‘వెళ్లిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల్లో హీరోగా నటించి, మూడో చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’తో దర్శకుడిగా మారారు విశ్వక్‌ సేన్‌. ఈ సినిమాకి స్క్రీన్‌ ప్లే కూడా అందించారు. ‘ఫలక్‌నుమా దాస్‌’తో హీరోగా మాస్‌ కా దాస్‌ అంటూ మంచి మాస్‌ ఫాలోయింగ్‌ తెచ్చుకోవడంతో పాటు రైటర్‌గానూ మార్కులు కొట్టేశారు విశ్వక్‌. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దాస్‌కి ధమ్కీ’ చేయడానికి విశ్వక్‌ కథ సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో లీడ్‌ రోల్‌లో నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తారు విశ్వక్‌.

కిరణ్‌ అబ్బురం
తొలి చిత్రం ‘రాజావారు రాణిగారు’తో హీరోగా హిట్‌ అందుకున్నారు కిరణ్‌ అబ్బవరం. తన ద్వితీయ చిత్రం ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’కి కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు రాసుకున్నారు కిరణ్‌. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీతో పాటు తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. హీరోగా.. రైటర్‌గా కిరణ్‌ ‘అబ్బురం’ అనిపించుకున్నారు. 

టాలెంట్‌ని ఎవరూ ఆపలేరు. బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా ఆ ప్రతిభే మంచి నిచ్చెన అవుతుంది. ఈ విషయంలో ఈ ‘కథా’నాయకులు మరికొందరికి ఆదర్శం అనొచ్చు.

చదవండి: ముడతలు కనిపిస్తున్నాయ్‌.. గ్లో తగ్గింది.. అనసూయపై కామెంట్లు
‘డీజే టిల్లు’ పిల్లతో కిరణ్‌ అబ్బవరం రొమాన్స్‌!

మరిన్ని వార్తలు