Thodelu Review: ‘తోడేలు’ మూవీ రివ్యూ

25 Nov, 2022 08:47 IST|Sakshi
Rating:  

టైటిల్‌: తోడేలు
నటీనటులు: వరుణ్ ధావన్, కృతిసనన్, దీపక్ దొబ్రియాల్, అభిషేక్ బెనర్జీ, సౌరబ్ శుక్లా తదితరులు
నిర్మాత: దినేష్ విజన్
దర్శకుడు: అమర్ కౌశిక్
సంగీతం: సచిన్ జిగార్
సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్జి
ఎడిటర్‌: సంయుక్త కాజా
విడుదల తేది: నవంబర్‌ 25, 2022

కథేటంటంటే.. 
ఢిల్లీకి చెందిన  భాస్కర్‌(వరుణ్‌ ధావన్‌) ఓ కాంట్రాక్టర్‌. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్ట్‌ దక్కించుకుంటాడు. అక్కడ ప్రజలను ఒప్పించి రోడ్డు నిర్మించేందుకే స్నేహితులతో (దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్)‌ కలిసి అరుణాచల్‌కు వెళ్తాడు. అయితే అక్కడ భాస్కర్‌ అనూహ్యంగా తోడేలు కాటుకు గురవుతాడు. చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ అనైక(కృతీసనన్‌)దగ్గరకు వెళ్తాడు. ఆమె ఏ మందు ఇచ్చిందో తెలియదు కానీ భాస్కర్‌ ప్రతిరోజు రాత్రి తోడేలుగా మారిపోతాడు. అసలు భాస్కర్‌ని తోడేలు ఎందుకు కరిచింది? ప్రతి రోజు రాత్రి కొంతమందిని మాత్రమే చంపడానికి కారణమేంటి? తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి భాస్కర్‌ చేసిన ప్రయత్నం ఏంటి? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి భాస్కర్‌కు ఎలాంటి సహకారం అందింది? అనైకతో భాస్కర్‌ ప్రేమ సఫలమైందా లేదా? రోడ్డు నిర్మించాలనుకున్న బాస్కర్‌ ప్రయత్నం ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
ప్రకృతిని నాశనం చేసేందుకు ప్రయత్నించిన దుష్ట శక్తులను జంతువుల రూపంలో దేవుడు అడ్డుకుంటాడనేది చాలా సినిమాల్లో చూశాం. తోడేలు సినిమా లైన్‌ కూడా అదే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ పాతదే అయినా.. కథను విస్తరించిన తీరు బాగుంది. అయితే ప్రేక్షకుడి ఊహకి అందేలా కథనం సాగడం మైనస్‌. క్లైమాక్స్‌ మాత్రం ఊహించని విధంగా మలిచాడు. సీరియస్‌ అంశాలను కూడా బోర్‌ కొట్టించకుండా కామెడీ వేలో చూపించారు. విజువల్స్‌, గ్రాఫిక్స్‌ వర్క్‌ చాలా బాగున్నాయి. అరుణాచల్‌ అడవి అందాలు, తోడేలు విన్యాసాలు ప్రేక్షకులను అలరిస్తాయి.

ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమాకు ప్రధాన బలం వరుణ్‌ ధావన్‌ అనే చెప్పాలి. తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. తోడేలుగా మారుతున్న సమయంలో ఆశ్చర్యపోయేలా అతని నటన ఉంటుంది. ఈ సినిమా కోసం వరుణ్‌ ధావన్‌ పడిన కష్టమంతా తెరపై కనిపించింది. డాక్టర్‌ అనైకగా కృతిసనన్‌ మెప్పించింది. హీరో స్నేహితులుగా దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్‌ చేసే కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సచిన్ జిగార్ సంగీతం బాగుంది. తంకేశ్వరి పాట ఆకట్టుకుంటుంది. జిష్ణు కెమెరా పనితీరు అద్భుతంగా ఉంది. అరుణాల్‌ ప్రదేశ్‌ అందాలను తెరపై చక్కగా చూపించాడు. వీఎఫ్‌ఎక్స్‌ అద్భుతంగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు