Radha Prasanthi: ఐఏఎస్‌, ఐపీఎస్‌లు నా ఇంటి ముందు క్యూ.. కొందరు కావాలని నా ఇల్లు తగలబెట్టారు..

12 Apr, 2023 16:23 IST|Sakshi

తన హావభావాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటి రాధ ప్రశాంతి. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె టైగర్‌, ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. భయమనేదే ఎరుగనని చెప్తూ ఉండే రాధ ప్రశాంతి ఆంధ్రా-ఒడిశా బార్డర్‌లోని కాశీనగర్‌లో జన్మించింది. ఆమె అసలు పేరు కృష్ణవేణి. తొమ్మిదో తరగతిలోనే తండ్రిని కోల్పోవడంతో చదివించేవాళ్లు లేక విద్యకు దూరమైంది. స్టేజీపై డ్రామాలు చేస్తూ నెమ్మదిగా వెండితెరకు పరిచయమైంది. 

పెళ్లిపందిరి, పెళ్లికానుక, లవకుశ.. వంటి పలు చిత్రాల్లో నటించింది. హీరోయిన్‌గా, సెకండ్‌ హీరోయిన్‌గా, సహాయక నటిగా పలు పాత్రలు పోషించింది. రెండు దశాబ్దాలుగా వెండితెరకు దూరమైన ఆమె కరోనా సమయంలో ఆహారం పంపిణీ చేస్తూ ఎంతోమందికి సేవ చేసింది. భర్త సాయంతో శ్రీకాకుళంలో గూడు లేనివాళ్లకు ఇళ్లు సైతం కట్టించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

నా కోసం బస్సు తగలబెట్టాడు..
'మా ఇంట్లో అందరం ఫైర్‌బ్రాండ్సే. నేను కాలేజీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ బస్సు మా ఇంటి ముందు ఆపడం లేదని మా పెద్దన్న ఏకంగా బస్సునే తగలబెట్టాడు. ఎక్కడికి వెళ్లినా నాతో బాడీగార్డులా వచ్చేవాడు. మొదట నేను నాటకాలు వేసేదాన్ని. తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టా. హిందీతో పాటు దక్షిణాదిలో నాలుగు భాషల్లో చేశాను. వి.మధుసూదన్‌రావు డైరెక్షన్‌లో లవకుశ మూవీలో సెకండ్‌ హీరోయిన్‌గా చేశా. హిందీలో స్వప్నసుందరి సీరియల్‌ చేశాను. 

నిద్రమాత్రలు మింగి..
12 ఏళ్లపాటు సినీ పరిశ్రమలో ఉన్నాను. హీరోయిన్‌గా మంచి ఆఫర్లు వస్తున్న సమయంలో పెళ్లైంది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లి ఎలా జరిగిందంటే.. ఆయన నన్ను చూసి ఇష్టపడ్డారు. నా నెంబర్‌ తీసుకుని రాత్రి ఫోన్లు చేసేవాళ్లు. ఏంటి? ఇలా విసిగిస్తున్నావని అడిగితే తన ఫైనాన్స్‌ కంపెనీకి సంబంధించిన యాడ్‌ చేస్తారా? అని అడిగేవాడు. ఫైనాన్స్‌ కంపెనీలకు నేను యాడ్‌ చేయనని ముఖం మీదే చెప్పాను. అయినా తన ప్రవర్తన వింతగానే ఉండేది. అసలు విషయం ఆరా తీస్తే నన్ను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడని తెలిసింది. నేను నో చెప్పడంతో నిద్రమాత్రలు మింగి మూడంతస్తుల భవంతిపై నుంచి దూకాడు. వందల కోట్ల ఆస్తి ఉన్న అతడు ఎవరినీ కాదని, నిన్నే కావాలనుకుంటున్నాడంటే అతడి ప్రేమను అర్థం చేసుకోమన్నారు.

చిన్నప్పటి నుంచి కష్టాలు..
నిజానికి నేను అతడికి నో చెప్పడానికి కారణం ఉంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూశాను. నటిగా పేరు ప్రఖ్యాతలు వచ్చిన సమయంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు నన్ను పెళ్లి చేసుకునేందుకు మా ఇంటి ముందుకు వచ్చేవారు. నాకు మాత్రం పెళ్లిపై ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు. కానీ చివరకు నాకోసం ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డ కిరణ్‌ కుమార్‌ను పెళ్లి చేసుకున్నాను. అయితే అత్తారింట్లో వాళ్లు సినిమా ఇండస్ట్రీకి కొంత దూరంగా ఉండేవారు. పెళ్లైన ఏడాది తర్వాత రామానాయుడు మంచి ఆఫర్లు ఇచ్చారు, కానీ నా భర్త ఒప్పుకోలేదు. పిల్లలు చిన్నవాళ్లు.. ఇప్పుడెందుకు అనడంతో ఆ అవకాశాలు తిరస్కరించాను. అలా వచ్చిన గ్యాప్‌ ఇప్పటికీ కొనసాగుతోంది.

ఇల్లు తగలబెట్టారు
కరోనా సమయంలో నా ఇల్లు తగలబడిపోయింది.  కానీ అది ప్రమాదవశాత్తూ జరగలేదు, కొందరు కావాలనే చేశారు.  జూన్‌ 6న నా ఇంటికి నిప్పుపెట్టారు. మూడు ఫ్లోర్ల భవంతిలో కేవలం నా ఒక్క ఇల్లే కాలిపోయిందంటే అక్కడే అర్థమైపోతుంది ఇదంతా ఓ కుట్ర అని! ఆ సమయంలో మా ఆయన పిల్లలతో పాటు ఊర్లో స్ట్రక్‌ అయిపోయారు. అందరూ కరోనా భయంతో ఉన్నారు. ఎవరి దగ్గర తలదాచుకోవాలో తెలియలేదు. ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో రామకృష్ణ మఠ్‌ వాళ్లు ఆశ్రయం కల్పించారు. వారు ఆశ్రయం ఇవ్వకపోతే నేనీ రోజు ఉండేదాన్ని కాదేమో! నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు. కానీ మనిషి జీవితం మారిపోవడానికి, చనిపోవడానికి ఒక్క క్షణం చాలు అని చెప్పుకొచ్చింది రాధా ప్రశాంతి.

మరిన్ని వార్తలు