ప్రేమికుల దినోత్సవానికి టైటానిక్‌

13 Jan, 2023 00:41 IST|Sakshi
కేట్‌ విన్స్‌లెట్, లియోనార్డో

సినిమా లవర్స్‌కి.. అందులోనూ ప్రేమకథా చిత్రాల ప్రేమికులకు ఈ ప్రేమికుల దినోత్సవానికి సిల్కర్‌ స్క్రీన్ పై ‘టైటానిక్‌’ ప్రత్యక్షం కానుంది. టైటానిక్‌ ఓడలో పరిచయం అయి, ప్రేమికులుగా దగ్గరయ్యే జాక్, రోజ్‌లు చివరికి ఓడ ప్రమాదంలో దూరమయ్యే ఈ విషాదభరిత ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. ప్రేమికులుగా లియో నార్డో డికాప్రియో, కేట్‌ విన్ ్సలెట్‌ల కెమిస్ట్రీని అంత సులువుగా ఎవరూ మరచిపోలేరు.

జేమ్స్‌ కామెరూన్  తెరకెక్కించిన ఈ ఎవర్‌గ్రీన్  లవ్‌స్టోరీ విడుదలై 25 ఏళ్లయింది. ఈ సిల్వర్‌ జూబ్లీ సందర్భంగా ఈ చిత్రాన్ని హై క్వాలిటీతో మళ్లీ సిల్వర్‌ స్క్రీన్ పైకి తీసుకు రావాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించి పోస్టర్‌ని, ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ట్వంటీయత్‌ సెంచురీ ఫాక్స్‌. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 4కే ప్రింట్‌తో త్రీడీ వెర్షన్ లో ఈ లవ్‌స్టోరీ కొత్త హంగులతో రావడానికి సిద్ధమవుతోంది.

ఇక 1997 నవంబర్‌లో విడుదలైన ‘టైటానిక్‌’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ. 13 వేల కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి, రికార్డు సృష్టించింది. 2010లో జేమ్స్‌ కామెరూన్  అద్భుత సృష్టి ‘అవతార్‌’ విడుదలయ్యే వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రికార్డ్‌ ‘టైటానిక్‌’దే. కామెరూన్  తన సినిమా రికార్డ్‌ని తానే బద్దలు కొట్టడం విశేషం. ఇక ఆస్కార్‌ అవార్డ్స్‌లో 14 నామినేషన్లు దక్కించుకుని, 11 అవార్డులను సొంతం చేసుకున్న ఘనత కూడా ‘టైటానిక్‌’కి ఉంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు ఇలా పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం త్రీడీ వెర్షన్‌ని 2012లో విడుదల చేశారు. ఇప్పుడు మరింత క్వాలిటీతో ‘టైటానిక్‌’ రానుంది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు