Chalapathi Rao Death: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. విలక్షణ నటుడు చలపతిరావు కన్నుమూత

26 Dec, 2022 00:41 IST|Sakshi

ప్రతి నాయకుడిగా, సహాయ నటుడిగా, హాస్య నటుడిగా ప్రేక్షకులను మెప్పించిన సీనియర్‌ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు (78) ఇక లేరు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారాయన. 1200 పైగా చిత్రాల్లో నటించిన చలపతిరావు ఇంకా నటుడిగా కొనసాగుతున్నారు. చనిపోయే ఐదు రోజుల ముందు కూడా నటుడిగా మేకప్‌ వేసుకున్నారాయన.

కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రులో మణియ్య, వియ్యమ్మ దంపతులకు 1944 మే 8న చలపతిరావు జన్మించారు. నందమూరి తారక రామారావు అంటే ఎంతో ఇష్టం. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో తాను కూడా హీరో కావాలని అవకాశాల్ని వెతుక్కుంటూ మద్రాస్‌ (చెన్నై) వెళ్లారు చలపతిరావు. సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన ‘గూఢచారి 116’ (1966) ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు చలపతిరావు. ఆ తర్వాత ‘సాక్షి, బుద్ధిమంతుడు, టక్కరి దొంగ చక్కని చుక్క’ వంటి చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్‌ ప్రోత్సాహంతో ‘కథానాయకుడు’ (1969) సినిమాలో మున్సిపల్‌ కమిషనర్‌ పాత్ర చేశారు. ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం కారణంగా కెరీర్‌ ఆరంభంలో ఐదారేళ్ల పాటు ఆయన సినిమాల్లోనే నటించారు చలపతిరావు.

హీరో కావాలని వెళ్లిన చలపతిరావుకి ఎక్కువగా విలన్‌ పాత్రలే వచ్చేవి. అయితే ‘దాన వీర శూర కర్ణ’ చిత్రం ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ సినిమాలో ఐదు పాత్రల్లో నటించారాయన. కెరీర్‌ ఆరంభంలో ఎక్కువగా మానభంగం సన్నివేశాల్లో నటించారు చలపతిరావు. దాదాపు 90కి పైగా రేప్‌ సీన్స్‌లో నటించారాయన. అప్పటివరకు విలన్‌ పాత్రలు చేసిన చలపతిరావుని ‘నిన్నే పెళ్లాడతా’ (1996) సినిమా నటుడిగా ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. సాఫ్ట్‌ క్యారెక్టర్స్‌కు ఆయన న్యాయం చేయగలరనే నమ్మకం దర్శక–నిర్మాతల్లో కలిగించింది ఆ సినిమా. దీంతో ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత మంచి తండ్రి, బాబాయ్‌ పాత్రలు కూడా ఆయన్ని వరించాయి.

ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణంరాజు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో పాటు నేటి తరం యువ హీరోల సినిమాల్లోనూ ఆయన వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆయన ఈ ఏడాది వెండితెరపై కనిపించిన చిత్రం ‘బంగార్రాజు’ (2022). ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో దాదాపు 1200లకుపైగా సినిమాల్లో నటించారు చలపతిరావు. తనయుడు రవిబాబు దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారాయన. అయితే అనుకోని విధంగా హఠాన్మరణం పొందారు. చలపతిరావు భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు తనయుడు రవిబాబు ఇంట్లోనే ఉంచారు. ఆ తర్వాత ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానానికి తరలించారు.

అమెరికాలో ఉంటున్న చలపతిరావు ఇద్దరు కుమార్తెలు రాగానే బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చలపతిరావు మరణవార్త తెలిసిన తర్వాత పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన స్వగృహానికి చేరుకుని నివాళులు అర్పించారు. చలపతిరావు భౌతిక కాయానికి నివాళులర్పించినవారిలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, చిరంజీవి, వెంకటేశ్, గోపీచంద్, సురేష్‌బాబు తమ్మారెడ్డి భరద్వాజ తదితర ప్రముఖులు ఉన్నారు. సినీ పరిశ్రమ ‘బాబాయ్‌’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే చలపతిరావు ఇలా హఠాత్తుగా దూరం కావడం బాధాకరం అని పేర్కొన్నారు.


నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చలపతిరావు ఆర్‌సీ క్రియేషన్స్‌ అనే బ్యానర్‌ స్థాపించి నిర్మాతగా మారారు. తొలి చిత్రంగా బాలకృష్ణతో ‘కలియుగ కృష్ణుడు’ నిర్మించారు. ఆ తర్వాత ‘కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, ప్రెసిడెంట్‌గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి’ వంటి చిత్రాలు నిర్మించారు.   

చలపతిరావుకు 19 ఏళ్లకే ఇందుమతితో పెళ్లయింది. వీరిది ప్రేమ వివాహం. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. తన 28వ ఏట జరిగిన ఓ ప్రమాదంలో భార్య ఇందుమతిని కోల్పోయారు చలపతిరావు. ఆ తర్వాత ఆయన మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడగా, కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా కొనసాగుతున్నారు.

 మా నాన్న సంతోషంగా వెళ్లిపోయారు
శనివారం రాత్రి సుమారు 8.30 గంటలకు మా నాన్న కన్నుమూశారు. నిజ జీవితంలో సంతోషంగా ఉంటూ, అందర్నీ ఎలా నవ్వించారో అంతే సంతోషంగా వెళ్లిపోయారు. చికెన్‌ బిర్యాని, చికెన్‌ కూర తిన్నాక  ప్లేట్‌ని అలా చేతికి అందించి వెనక్కి వాలిపోయి సింపుల్‌గా, సంతోషంగా, ఎలాంటి నొప్పి లేకుండా కొన్ని క్షణాల్లో తుదిశ్వాస విడిచారు. నాన్నగారి అంత్యక్రియలు ఆదివారం చేద్దామనుకున్నాం.. కానీ, నా సిస్టర్స్‌ అమెరికాలో ఉన్నారు. వారు మంగళవారానికి హైదరాబాద్‌ చేరుకుంటారు. ఆరోజు అంత్యక్రియలు నిర్వహించకూడదంటున్నారు కాబట్టి బుధవారం నిర్వహిస్తాం. నాన్నగారికి ఇష్టమైనవి మూడు. ఎన్టీఆర్‌గారు, మంచి భోజనం, జోక్స్‌ చెప్పడం అంటే ఇష్టం. నేను తీస్తున్న ఓ సినిమాలో ఆయనకి మంచి పాత్ర రాశాం. ఐదు రోజుల క్రితమే ఆ షూటింగ్‌లో సంతోషంగా నటించారు. అదే ఆయన ఆఖరి సినిమా.
– రవిబాబు

చలపతిరావు మృతిపట్ల ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన రవిబాబుకి వీడియో కాల్‌ చేసి, చలపతిరావు భౌతిక కాయాన్ని చూసి ‘మీరు మరణించారనే వార్తని జీర్ణించుకోలేకపోతున్నాం.. లే బాబాయ్‌.. లే’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

ఆయనవన్నీ మంచి అలవాట్లే
ఈ డిసెంబర్‌ ఆవేదనని కలిగించింది. కైకాల గారు దూరం అయ్యారు. వెంటనే చలపతిరావుగారిని కోల్పోవడం చాలా బాధాకరం. మద్రాసు (చెన్నై)లో ఉన్నప్పటి నుంచే ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. చలపతిరావుగారితో ఎన్నో సినిమాల్లో కలిసి నటించాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మంచి వ్యక్తి ఆయన. అన్ని రకాల పాత్రలు చేసిన గొప్ప నటుడు. ఆయన వేసిన పాత్రలకు, వ్యక్తిగత అలవాట్లకు అస్సలు సంబంధం ఉండదు. ఆయనకు ఉన్న అలవాట్లన్నీ మంచివే. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే ఆయన ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునేవారు. అలాంటిది అకస్మాత్తుగా ఇలా గుండెపోటుతో మృతిచెందడం బాధాకరం.  
– చిరంజీవి

ఆయన సెట్లో ఉంటే ఎనర్జీయే
నా తొలి సినిమా నుంచి ఎన్నో సినిమాలకు చలపతిరావుగారితో కలిసి పని చేశాను.. మేమొక ఫ్యామిలీలా ఉండేవాళ్లం. ఆయన ఇంత అకస్మాత్తుగా వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది. అయితే చాలా ప్రశాంతంగా పోవడం ఆయన అదృష్టం. అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవారు. ప్రతి ఒక్కరితో చాలా సరదాగా ఉండేవారు. మనం హ్యాపీగా ఉండాలంటే ఆయనతో ఉండాలి.. సెట్‌లో ఆయన ఉంటే ఎంత రిలాక్స్‌గా ఉంటామో మాకందరికీ తెలుసు.. సెట్స్‌లో అందరికీ ఆయన మంచి ఎనర్జీ ఇచ్చేవారు. చిన్నా పెద్దా అని కాకుండా ప్రతి ఒక్కరూ ఆయన కంపెనీని బాగా ఎంజాయ్‌ చేసేవారు. అలాంటి మనిషి సడన్‌గా దూరమవడం చాలా బాధగా ఉంది.
– వెంకటేశ్‌

నివాళులర్పిస్తున్న వెంకటేశ్, చిరంజీవితో రవిబాబు

చదవండి: (Sneha- Prasanna: వివాహ బంధానికి గుడ్‌ బై!.. వదంతులకు నటి స్నేహ సమాధానం) 

మరిన్ని వార్తలు