Pooja Hegde: అందులో నిజం లేదు.. అలాగైతే ఇంతవరకూ వచ్చేదానినా? 

24 Dec, 2022 06:58 IST|Sakshi

వాస్తవాలు, అవాస్తవాలు మధ్య పుట్టేదే వార్త. ఈ మధ్య కాలంలో నిజమేదో, అబద్దమేదో తెలుసుకోవడం కష్టంగా మారింది. సినీ తారల పరిస్థితి అలాగే ఉంది. నటి పూజాహెగ్డే గురించి చెప్పాలంటే కోలీవుడ్‌లో ముఖముడి చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బాలీవుడ్‌ బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్‌లో పాగావేసి అక్కడ వరుస విజయాలతో దూసుకుపోతోంది.

ఇటీవల తమిళంలో రెండో ప్రయత్నంగా విజయ్‌తో రొమాన్స్‌ చేసిన బీస్ట్‌ చిత్రం కూడా విజయాన్ని అందించలేకపోయింది. దీంతో హిందీ, తెలుగు చిత్రాలనే నమ్ముకుంది. ఈ పరిస్థితుల్లో పూజాహెగ్డే నిర్మాతలకు భారంగా మారిందన్న ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆమె చిత్రాలు నష్టాలను చవి చూసినా పారితోషికాన్ని మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తోందని, మేకప్‌ మ్యాన్, హెయిర్‌ డ్రెస్సర్, మేనేజర్, బాడీగార్డ్స్‌ అంటూ 15 నుంచి 20 మంది ఆమె తరపు సిబ్బందిని నిర్మాతలే భరించాలనే షరతులు విధిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీనిపై నటి పూజా హెగ్డే స్పందిస్తూ కథ బాగున్నా తాను అడిగిన పారితోషికానికి ఒకే అనకపోతే ఆ చిత్రాన్ని తిరస్కరిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. తాను డబ్బే లక్ష్యంగా నటించడం లేదని చెప్పింది. అలాగైతే తాను ఇంతవరకు వచ్చేదాన్నే కాదని, ప్రస్తుతం ఉన్న పోటీలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే బుద్ధిశాలి తనమని పేర్కొంది. అదే విధంగా మంచి చిత్రాలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం నటీమణులకు ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పారితోషికం కోసం వచ్చిన అవకాశాన్ని అంగీకరించి నటిస్తే కనిపించకుండా పోతామని పూజాహెగ్డే పేర్కొంది.

చదవండి: (Arun Vijay: ప్లీజ్‌.. వదంతులను ప్రచారం చేయొద్దు)

మరిన్ని వార్తలు