Raja Ravindra: అంతదాకా వస్తే టీ.. కాఫీ అందించడానికీ రెడీయే!

18 Aug, 2021 00:22 IST|Sakshi

‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్‌’. కరోనా సమయంలో ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ రాలేదు కాబట్టి మా చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది. ప్రేక్షకులు రెండు గంటల పాటు హాయిగా నవ్వుకుంటారు’’ అని నటుడు రాజా రవీంద్ర అన్నారు. శ్రీముఖి, రాజా రవీంద్ర, మనో, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్‌’. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. గుడ్‌ సినిమా గ్రూప్స్, గ్రీన్‌ మెట్రో మూవీస్, శ్రీవాస్‌ 2 క్రియేటివ్స్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న  విడుదలవుతోంది.

ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ– ‘‘జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేకపోతేనే పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. అలాంటి ఓ పాయింట్‌ను వినోదాత్మకంగా చెప్పాం. ఈ సినిమాలో నా పాత్ర పేరు రాజు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాను. యాభై ఏళ్లు దాటిన రాజుని మనవళ్లు, మనవరాళ్లు వచ్చిన తర్వాత భార్య సరిగ్గా పట్టించుకోదు. ఆ సమయంలో సోషల్‌ మీడియాలో అమ్మాయితో చాటింగ్‌ చేస్తాడు.

ఓ చిన్న తప్పు కారణంగా ఎలాంటి సమస్యలొచ్చాయి? అనేదే కథ. విలన్‌ పాత్రలు చేయడం ఈజీ. కానీ కామెడీ చాలా కష్టం.. సరైన టైమింగ్‌ ఉండాలి. చిరంజీవిగారి ‘ఆచార్య’లో మంచి పాత్ర చేశాను. రవితేజ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ‘రోజ్‌ విల్లా’తో పాటు సోహైల్‌ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ నటిస్తున్నాను. నాకు సినిమా అంటే పిచ్చి. ఒకవేళ ఆర్టిస్టుగా అవకాశాలు రాకపోతే టీ, కాఫీలు ఇచ్చుకుంటూ ఇండస్ట్రీలోనే ఉండిపోతా’’ అన్నారు. 

మరిన్ని వార్తలు