ఆ అవకాశం పొందలేకపోయాను: చిరంజీవి

8 Sep, 2020 11:33 IST|Sakshi

జయప్రకాశ్‌రెడ్డి మరణం: సినీ ప్రముఖుల సంతాపం

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నటుడు జ‌య‌ప్ర‌కాశ్‌ రెడ్డి మ‌ర‌ణం పట్ల సీనియర్‌ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పదిమందికి సహాయం చేయాలనుకునే మంచి వ్యక్తి అని, లక్ష్మీ పిక్చర్స్‌ బ్యానర్‌లో నిర్మించిన సినిమాల్లో ఆయన ఎన్నో మంచి పాత్రలు పోషించారని జయప్రకాశ్‌ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసు​కున్నారు. ``జయప్రకాశ్‌ రెడ్డి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ లో ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారు. జయప్రకాశ్‌ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధున్ని కోరుకుంటున్నాను’’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు.(చదవండి: నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత)

ఆ అవకాశం పొందలేకపోయాను: చిరంజీవి
‘‘సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. జయప్రకాష్‌ రెడ్డి గారితో నేను ఆఖరిగా చేసింది ఖైదీ నెంబర్‌ 150 సినిమాలో. ఆయన గొప్ప నటుడు. ‘‘నాటకరంగం నన్ను కన్నతల్లి.. సినిమా రంగం నన్ను పెంచిన తల్లి’’అనే వారు. ‘‘అందుకే ఇప్పటికీ శని, ఆది వారాల్లో షూటింగులు పెట్టుకోనండి, స్టేజీ మీద పర్ఫామెన్స్‌ ఇస్తుంటాను. మీరెప్పుడైనా రావాలి’’అని అడిగేవారు. ఆ అవకాశాన్ని నేను పొందలేకపోయాను. సినిమాల్లో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌ అంటే మొదట గుర్తువచ్చేది జయప్రకాశ్‌ రెడ్డి గారే. తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ సృష్టించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ వేదిగకా నివాళులు అర్పించారు.

ఆయన మృతి విషాదకరం: రాజమౌళి
జయప్రకాష్‌ రెడ్డి మృతి పట్ల ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఆయన ఆకస్మిక మరణ వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. విషాదకరం. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతుల్ని మిగిల్చింది. విలక్షణ నటన, మీదైన కామెడీ, విలనిజంతో దశాబ్దాల తరబడి మాకు వినోదం పంచినందుకు ధన్యవాదాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని ప్రార్థించారు.

విలక్షణ నటుడిని కోల్పోయిన సినీ నాటక రంగం: ఎఫ్‌డిసి చైర్మన్ విజయ్ చందర్
తెలుగు సినీ రంగంలో తనదంటూ ఒక నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ లక్షలాది ప్రేక్షకుల మన్ననలు పొందిన విలక్షణ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి మరణం సినీ ప్రపంచానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి చైర్మన్ టి.ఎస్.విజయ్ చందర్ తన సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగఢ సానుభూతి తెలిపారు. రంగ స్థల నటుడిగా ప్రస్థానం ప్రారంభించి దాదాపు వందకు పైగా చలన చిత్రాలలో నటించి, నాటక సినీ రంగంలో జయప్రకాశ్ రెడ్డి ఒక సంచలనం సృష్టించారని ఆయన చెప్పారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సినీ ప్రేక్షకులను ఉర్రుతలూగించి యాస, భావ వ్యక్తీకరణలో తనదంటూ ఒక శైలిని సృష్టించారని విజయ్ చందర్ తెలిపారు. జయప్రకాశ్ రెడ్డితో ఇండస్ట్రీలో తనకు కూడా మంచి అనుబంధం ఉండేదని ఆయనతో పరిశ్రమకు సంబంధించి అనేక అంశాలు తరచూ చర్చించే వారని ఎఫ్‌డిసి చైర్మన్ తెలిపారు. 

తెలుగు సినీ నాటక రంగానికి తీరని లోటు : ఎఫ్‌డిసి ఎండి టీవీకే రెడ్డి
ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి తెలుగు సినీ, నాటక రంగానికి తీరని లోటని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయకుమార్ రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. గుంటూరు లో తుది శ్వాస విడిచిన జయప్రకాశ్ రెడ్డి అనేక మంది సినీ జన హృదయాలలో చెరగని ముద్ర వేశారని తెలిపారు. సినిమాలకు, నాటకాలకు కూడా ఆయన ప్రతిష్టాకరమైన నందీ అవార్డులను సాధించి పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నారని అన్నారు. ఆయన కుటుంబానికి విజయకుమార్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

గొప్ప నటుల్లో ఒకరు: మహేష్‌ బాబు
జయప్రకాశ్‌రెడ్డి గారి మరణం ఎంతో విషాదకరం. టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటుల్లో ఆయన కూడా ఒకరు. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

ఆయన ఆత్మకు శాంతి కలగాలి: జూ. ఎన్టీఆర్‌
అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. 

చాలా సినిమాల్లో కలిసి నటించాను: రకుల్‌
ఇది చాలా బాధాకరం. ఆయనతో కలిసి చాలా సినిమాల్లో నటించాను. వారి కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి. జయప్రకాశ్‌ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలి.

ఓం శాంతి: కాజల్‌ అగర్వాల్‌
జయప్రకాశ్‌రెడ్డి గారి కుటుంబానికి ప్రగాభ సానుభూతి తెలుపుతున్నా. ఓం శాంతి.

>
మరిన్ని వార్తలు