Sarath Babu: పవిత్రను.. నన్ను దీవించాడు.. బోరున ఏడ్చేసిన నరేశ్!

22 May, 2023 20:07 IST|Sakshi

సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్‌లోని ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. టాలీవుడ్‌ నటులు నరేశ్, రాజేంద్ర ప్రసాద్, నందమూరి బాలకృష్ణ, మా అధ్యక్షుడు మంచు విష్ణు, జయసుధ, మురళీ మోహన్, ఏడిద రాజా, శివాజీ రాజా, శివబాలాజీ, పవిత్రా లోకేశ్ తదితరులు ఆయనకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. శరత్‌ బాబు పార్థీవదేహం వద్ద సీనియర్ నటుడు నరేశ్ బోరున విలపించారు. తాను ఒక మంచి మిత్రున్ని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు. 

నరేశ్ మాట్లాడుతూ.. 'శరత్ బాబు గొప్పనటుడే కాదు.. అందగాడు. శరత్ బాబు నేను మంచి మిత్రులం. ఆయనతో కలిసి 12 సినిమాలు చేశాం. శరత్ బాబు ఒడ్డు పొడుగు చూసి అసూయపడేవాన్ని.  మళ్లీ పెళ్లి చిత్రంలో జయసుధకు జోడిగా నటించమని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. ఆఖరి రోజుల్లో కుడా ఆరోగ్యంగా ఉన్నారు. పవిత్రను నన్ను దీవించి వెళ్లాడు. ఆఖరి రోజుల్లో తోడు అవసరమని చెప్పాడు. మనస్సు విప్పి మాట్లాడుకునే మంచి మిత్రుణ్ణి కోల్పోయా. మా బ్యానర్‌లో చివరి సినిమా చేశారనే ఆనంద పడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. మళ్లీ పెళ్లి ఫస్ట్ కాపీ చూస్తుండగా ఆయన చనిపోయారని ఫోన్ రావడంతో కన్నీళ్లు ఆగలేదు.' అంటూ ఫుల్ ఎమోషనలయ్యారు. ఆయనతో పాటు పవిత్రా లోకేశ్ కూడా నివాళులర్పించారు. 

(ఇది చదవండి: కమెడియన్‌ సుధాకర్‌ చనిపోయాడంటూ ఫేక్‌ రూమర్స్‌..)

మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు: రాజేంద్రప్రసాద్ 

శరత్ బాబు మృతి పట్ల నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..' మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు శరత్ బాబు. నా ఎదుగుదలలో దగ్గరున్న వ్యక్తి శరత్ బాబు. ఆయన మరణం దైవ నిర్ణయం. శరత్ బాబు అనారోగ్యంతో పోరాడి తనను తాను కోల్పోయాడు.  అత్యంత ఆప్తుడైన శరత్ బాబును కోల్పోవడం నాకు నా కుటుంబానికి ఎంతో తీరని లోటు.' అంటూ ఎమోషనలయ్యారు. 

అంకితభావం గల నటుడు:  నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. 'శరత్ బాబు విలక్షణమైన నటనతో చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా తనదైన ముద్ర వేశారు. శరత్ బాబు గారు క్రమశిక్షణ, అంకితభావం గల నటులు. ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. శరత్ బాబు మరణం పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.  

ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించా: జయసుధ

సీనియర్ నటి జయసుధ మాట్లాడుతూ..' శరత్ బాబుతో నేను ఎన్నో సినిమాల్లో నటించా. నా బెస్ట్ మూవీస్ అన్నీ ఆయనతోనే ఉన్నాయి. ఇటీవలే ఆయనతో మళ్లీ పెళ్లి చిత్రంలో నటించాను. సినిమా షూటింగ్ అప్పుడు చాలా ఆరోగ్యంగానే ఉన్నారు. నెలరోజుల తర్వాత హాస్పిటల్‌లో ఉన్నాడని తెలిసింది. మంచి క్రమశిక్షణ కలిగిన నటుడు శరత్ బాబు. చిరునవ్వుతో పలకరించేవాడు. ఏ నటుడితో చులకనగా మాట్లాడేవాడు కాదు. శరత్ బాబు మరణం బాధగా ఉంది. శరత్ బాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాదు తమిళ సినీ పరిశ్రమకు కూడా తీరని లోటు.' అంటూ ఆయనను గుర్తు చేసుకున్నారు. 

(ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్‌ బాబు కన్నుమూత)

శరత్‌బాబు ఆత్మకు శాంతి చేకూరాలి : ఏడిద రాజా 

ఏడిద రాజా మాట్లాడుతూ.. 'దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు . మా పూర్ణోదయ సంస్థ తీసిన చిత్రాల్లో చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు.  తాయారమ్మ బంగారయ్య ,సీతాకోకచిలక  సాగర సంగమం ,స్వాతిముత్యం ,సితార , ఆపద్భాంధవుడు చిత్రాల్లో చాలా అధ్బుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మా సంస్థకు శాశ్వత ఆర్టిస్ట్‌గా పనిచేశారు. మా కుటుంబ సబ్యుడిని కోల్పోయాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలి.' అంటూ శరత్ బాబును కొనియాడారు. 

మరిన్ని వార్తలు